Manipur CM Biren Singh: మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..

Update: 2025-02-09 13:11 GMT

Manipur CM Biren Singh: మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ రాజీనామా

Manipur CM Biren Singh: మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మణిపూర్ లో గత రెండేళ్లుగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్ల కారణంగా మణిపూర్ సర్కార్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటోంది. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందని అక్కడి విపక్షాలు అనేక సందర్భాల్లో ఆందోళనలు కూడా చేశాయి.

సీఎం బిరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈ అల్లర్లకు నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న బీజేపిలోనూ అంతర్గతంగా కొన్ని విభేదాలు నెలకున్నాయి. మణిపూర్ ప్రజల్లోనే కాకుండా బీజేపి ఎమ్మెల్యేల్లోనూ ప్రభుత్వంపై నమ్మకం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

మణిపూర్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కొంతమంది బీజేపి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే బిరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవాళ రాజీనామా చేయడానికి ముందుగా మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం ఇంఫాల్ చేరుకుని బీజేపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లారు. అక్కడే గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి రాజీనామా లేఖను అందించారు. ఇంతకాలం పాటు కేంద్రం మణిపూర్ అభివృద్ధికి సహకరించిందని చెబుతూ బిరెన్ సింగ్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటివరకు అనిశ్చిత పరిస్థితులతో ఇబ్బందుపడిన మణిపూర్‌లో సీఎం బీరెన్ సింగ్ రాజీనామాతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. 20 మంది బీజేపి ఎమ్మెల్యేలు మావైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెబుతోంది. అదే కానీ జరిగితే మణిపూర్‌లో అధికారం చేతులు మారే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. 

 

Tags:    

Similar News