INDIA Alliance: ఇండియా కూటమికి బీటలు

INDIA Alliance: పంజాబ్‌లోనూ ఒంటరి పోరే అంటున్న ఆప్‌

Update: 2024-01-25 06:51 GMT

INDIA Alliance: ఇండియా కూటమికి బీటలు

INDIA Alliance: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ సారథ్యంలోని బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనే లక్ష్యంతో రూపొందిన ప్రతిపక్ష ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ తో పొత్తు ఉండబోదని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని నిన్న తాజాగా ప్రకటించారు. సీట్ల పంపకాలపై వారికి ఒక ప్రతిపాదన చేశాను. కానీ, దానిని వారు తిరస్కరించారు. కాబట్టే బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేయాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు మమతా.

సీట్ల పంపకాలపై కాంగ్రె్‌సలో ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయవచ్చుని.. మిగిలిన స్థానాల్లో ప్రాంతీయపార్టీలు పోటీ చేస్తాయని తెలిపారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌ జోక్యం చేసుకుంటే మాత్రం మేం సహించేది లేదని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. అయితే, జాతీయస్థాయిలో మాత్రం తాము ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంటామని, ఎన్నికల తర్వాత ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలో అప్పుడు ఆలోచిస్తామన్నారు.

ఒంటరిగా వెళ్లాలని తమ నాయకురాలు నిర్ణయించటానికి కాంగ్రెస్‌ వైఖరే కారణమని తృణమూల్‌ నేతలు తెలిపారు. ఇండియా కూటమి ఏర్పాటైన కొత్తలో బీజేపీకి వ్యతిరేకంగా ముఖాముఖి ఒకే పార్టీ పోటీ జరిగేలా చూద్దామని అందరం భావించామని, కానీ కాంగ్రెస్‌ ఆ ఫార్ములాను పాటించటం లేదని చెప్పారు. తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీట్లను పంచుకోవటానికి కాంగ్రెస్‌ ఇష్టపడటం లేదని, ప్రాంతీయపార్టీలు బలంగా ఉండి తమ ఉనికి నామమాత్రంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం సీట్ల కోసం పట్టుబడుతోందని విమర్శించారు.

డిసెంబరు నెలాఖరులోపు సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకుందామని మమత చెప్పినప్పటికీ.. కాంగ్రెస్‌ తీవ్ర జాప్యం చేసిందని, చర్చలు ఫలించి ఉంటే ఒకటి రెండు సీట్లు అదనంగా ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డామని తృణముల్ కాంగ్రెస్ నేతలు తెలిపారు.

మమతా బెనర్జీ లేకుండా ఇండియా కూటమిని ఊహించలేమని, పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి పోటీ చేస్తుందని, భాగస్వామ్య పక్షాలన్నీ పాల్గొంటాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చెప్పారు. అనిశ్చితికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.

పంజాబ్‌లో ఉన్న మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తామే గెలుస్తామని ఆమ్‌ఆద్మీపార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగ్‌వంత్‌సింగ్‌ మాన్‌ తెలిపారు. కాంగ్రె్‌సతో ఎటువంటి చర్చలు లేవని చెప్పారు. ఒక్కో సీటుకు ముగ్గురు చొప్పున 13 సీట్లకు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నామని, విజయమే ప్రాతిపదికగా అభ్యర్థిని నిర్ణయిస్తామన్నారు. సీట్ల పంపకాలపై కాంగ్రె్‌స-ఆప్‌ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. మాన్‌ ఈ ప్రకటన చేయటంపై ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Tags:    

Similar News