విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న దీదీ

* ఇవాళ కీలక నేతలతో మమతా బెనర్జీ భేటీ * నేడు సోనియా గాంధీ, శరద్‌ పవార్‌, కేజ్రీవాల్అ, ఖిలేశ్‌ యాదవ్‌లతో సమావేశం

Update: 2021-07-28 03:10 GMT

మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో) 

Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీ టూర్‌ ఆసక్తిరేపుతోంది. ఐదురోజుల పర్యటనలో విపక్ష నేతలతో భేటీలు నేషనల్ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయి. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫ‌్రంట్‌ నెలకొల్పడమే లక్ష్యంగా దీదీ పావులు కదుపుతున్నారు. ఇటీవల ‌ఫ్రంట్ ఏర్పాటు అవసరమంటూ కామెంట్ చేసిన మమత ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు.

నిన్న ప్రధాని మోడీతో భేటీ అయిన దీదీ అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. కమల్‌నాథ్‌, ఆనంద్‌శర్మలతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ భేటీలో దేశాన్ని పట్టిపీడిస్తు్న్న అనేక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని కమల్ నాథ్ అన్నారు. ఇక ఇవాళ మమతా బెనర్జీ పలువురు కీలక నేతలను కలవనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లతో దీదీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

2024 లోక్‌సభ ఎన్నికలు టార్గెట్‌గా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మమత చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ వస్తుందా? దీదీ ప్రతిపాదనలకు విపక్షాల నుంచి వచ్చే స్పందన ఏంటనే ఆసక్తి నెలకొనగా ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రంట్ ఏర్పాటు ఎంతవరకు సాధ్యమనేది మరో ప్రశ్న.

Tags:    

Similar News