Maharashtra: బస్సులో ప్రసవించి.. కిటికీలో నుంచి విసిరేసి
Maharashtra: మహారాష్ట్రలో ఓ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సు ప్రయాణంలో ఓ యువతి బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం
Maharashtra: బస్సులో ప్రసవించి.. కిటికీలో నుంచి విసిరేసి
Maharashtra: మహారాష్ట్రలో ఓ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బస్సు ప్రయాణంలో ఓ యువతి బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం, ఆ పసికందును కిటికీ బయటకు విసిరేయడం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఆ శిశువు తీవ్రంగా గాయపడటం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ అమానవీయ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే స్పందించి చర్యలు ప్రారంభించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం — పర్భణి జిల్లా వాసి రితిక ధీరే అనే 19ఏళ్ల యువతి, అల్తాఫ్ షేక్ అనే యువకుడితో కలిసి పూణేలో నివాసం ఉంటుంది. ఇద్దరి మధ్య కొంతకాలంగా సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రితిక గర్భవతిగా మారింది. సోమవారం రాత్రి రితికతో కలిసి అల్తాఫ్ పర్భణికి బయలుదేరాడు. వీరిద్దరూ ప్రైవేట్ బస్సులో స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తుండగా, తెల్లవారుజామున పథ్రి–సేలు రోడ్డులో రితికకు పురుటినొప్పులు వచ్చాయి. ఆమె బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది.
పసికందు పుట్టిన కొద్దిసేపటికే, అల్తాఫ్ ఆ శిశువును ఓ గుడ్డలో చుట్టి బస్సు కిటికీ నుంచి బయటకు విసిరేశాడు. ఈ దృశ్యం ఓ స్థానికుడి దృష్టికి పడింది. అతను దగ్గరికి వెళ్లి చూశాడు. శిశువు మృతదేహాన్ని చూసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించి బస్సును ఆపి, రితిక, అల్తాఫ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
రితికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విచారణలో అల్తాఫ్, రితికను తన భార్య అని చెప్పినప్పటికీ, తమ వివాహానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడు. బిడ్డను పెంచే సామర్థ్యం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్తాఫ్ వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విచారాన్ని కలిగిస్తోంది. పసికందులపై ఇలాంటివి జరుగుతుండటం దిగ్భ్రాంతికరమని ప్రజలు స్పందిస్తున్నారు.