Maharashtra: లాక్ డౌన్ ఆంక్షలను సడలించనున్న మహారాష్ట్ర సర్కార్

Maharashtra: గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఆంక్షలను సడలించబోతున్నట్టు మహా ప్రభుత్వం ప్రకటించింది

Update: 2021-06-05 07:27 GMT

మహారాష్ట్ర అన్ లాక్ (ఫైల్ ఇమేజ్)

Maharashtra: కరోనా మహమ్మారి మహారాష్ట్రను కుదిపేసింది. దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే సంభవించాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన లాక్ డౌన్ విధించింది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఆంక్షలను సడలించబోతున్నట్టు మహా ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే సోమవారం నుంచి అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించబోతున్నామని ఐదు విడతల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తామని చెప్పింది.

కరోనా పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీలను ఆధారంగా చేసుకుని జిల్లాల వారీగా అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుందని మహా ప్రభుత్వం తెలిపింది. తొలి విడతలో పాజిటివిటీ ఐదు శాతం కంటే తక్కువ, 25 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాల్లో పూర్తి స్థాయిలో అన్ లాక్ జరుగుతుందని చెప్పింది. ప్రస్తుతం ఈ జాబితాలో 18 జిల్లాలు ఉన్నాయని ప్రకటించింది. లెవెల్ 1 కింద రెస్టారెంట్లు, సెలూన్లు, థియేటర్లు, షాపులు అన్నీ ఓపెన్ అవుతాయని చెప్పింది.

సెకండ్ లెవెల్ లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 25 నుంచి 40 వరకు ఉన్న జిల్లాలు వస్తాయి. ముంబై నగరం కూడా సెకండ్ లెవెల్ కిందకు వస్తుందని ప్రభుత్వం చెప్పింది. ముంబైలో సినిమా షూటింగులకు అనుమతిస్తామని తెలిపింది. లెవెల్ 2 కింద షాపులు తెరవచ్చని... అయితే రెస్టారెంట్లు, మాల్స్, జిమ్ లు, సెలూన్లకు మాత్రం పాక్షిక సడలింపు మాత్రమే ఉంటుందని చెప్పింది. ఫుల్ కెపాసిటీతో కార్యాలయాలను తెరవచ్చని తెలిపింది. బస్సులు తిరగొచ్చని, అయితే సీట్లకు సరిపడా ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది.

Tags:    

Similar News