Maharashtra: ఏక్‌నాథ్ షిండే నెక్స్ట్ స్టెప్ ఏంటి?
Maharashtra new CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కానీ, కొత్త సీఎం ఎంపికలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
Maharashtra: ముఖ్యమంత్రి ఎంపికలో జాప్యం దేనికి... ఏక్‌నాథ్ షిండే ప్లాన్స్ ఏంటి?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కానీ, కొత్త సీఎం ఎంపికలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నవంబర్ 29న జరగాల్సిన మహాయుతి కూటమి నాయకుల సమావేశం రద్దైంది. డిసెంబర్ 1 నాటికి ఈ సమావేశం వాయిదా పడింది. అయితే ఎన్ సీ పీ (శరద్ పవార్ వర్గానికి ) చెందిన ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ తో మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.మరోవైపు కొత్త ప్రభుత్వంలో షిండే ను పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వర్గానికి చెందిన నాయకులు సంజయ్ శిరాట్ చేసిన వ్యాఖ్యలు మహాయుతిలో ఏదో జరుగుతుందోననే చర్చను తెరమీదికి తెచ్చాయి.
24 గంటల్లో ఏక్ నాథ్ షిండే కీలక ప్రకటన
దిల్లీ పర్యటన తర్వాత మహాయుతి కూటమి నాయకుల కీలక సమావేశం రద్దు చేసుకొని సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి షిండే వెళ్లారు. అనారోగ్య కారణాలతోనే ఆయన స్వగ్రామానికి వెళ్లినట్టుగా చెబుతున్నారు. కానీ, మంత్రి పదవుల కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై షిండే అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది. ఈ అసంతృప్తి కారణంగానే నవంబర్ 29న జరగాల్సిన మహాయుతి నాయకుల కీలక సమావేశం రద్దైందనే ప్రచారం కూడా సాగుతోంది. డిసెంబర్ 1 న ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి ముందుగానే షిండే కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం తెరమీదికి వచ్చింది. అయితే షిండే ఏ ప్రకటన చేస్తారనేది ప్రస్తుతం అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. షిండేను కలిసేందుకు ఆ పార్టీ నాయకులు సతారాకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాలను చూస్తే షిండే ఏం ప్రకటన చేస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అమిత్ షా తో భేటీ తర్వాత ఏమైంది?
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నవంబర్ 28 రాత్రి మహాయుతి కూటమి నాయకులు ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అయ్యారు.అంతకుముందే ఎన్ సీ పీ అజిత్ పవార్ వర్గం నాయకులు ప్రపుల్ కుమార్ పటేల్ బీజేపీ అగ్ర నాయకులతో సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి పదవితో పాటు, మంత్రి పదవుల విషయంలో చర్చలు జరిగాయి. సీఎం ఎవరనే దానిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఈ సమావేశం తర్వాత నాయకులు ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. చర్చలు పూర్తైన తర్వాత మీడియాకు అన్ని వివరాలను వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి ముందు రోజునే సీఎం అభ్యర్ధి ఎంపిక విషయాన్ని బీజేపీ అధినాయకత్వం నిర్ణయం ఫైనల్ అని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు.
అమిత్ షాతో భేటీ తర్వాత సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేశారనే విషయం ప్రకటించడమే లాంఛనమనే ప్రచారం సాగింది. కానీ, ఈ సమావేశంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.ఈ సమావేశం తర్వాత ముంబైలో జరగాల్సిన మహాయుతి నాయకుల భేటీ వాయిదా పడింది. ధిల్లీ భేటీ తర్వాత సీఎం పదవిపై ప్రకటన లాంఛనమే అనుకున్నారు. కానీ, అందుకు విరుద్దంగా జరిగింది.
పదవుల పంపకాలపై షిండే అసంతృప్తి?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీజేపీ తీసుకోవాలని భావిస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మొత్తం కేబినెట్ లో 43 మందికి అవకాశం ఉంటుంది. 20 మంత్రి పదవులు బీజేపీకి దక్కుతాయి. శివసేన షిండే వర్గానికి 13, ఎన్ సీ పీ అజిత్ పవార్ వర్గానికి 9 మంత్రి పదవులు దక్కనున్నాయి. షిండే వర్గం హోంశాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ వంటి పదవులను కోరుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.
అయితే కీలక పదవులను తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడంతో పాటు ఇతర కీలక శాఖలు కూడా దక్కవని తేలడంతో షిండే అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంశాఖను కావాలని షిండే పట్టుబడుతున్నారని చెబుతున్నారు. ఆర్థికశాఖను ఎన్ సీ పీ అజిత్ పవార్ వర్గానికి కేటాయించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అయితే పదవుల పంపకంపై షిండే అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.
ఏక్‌నాథ్ షిండే 5 డిమాండ్లివే...
ముఖ్యమంత్రి పదవిని షిండే వదులుకుంటున్నందుకు బీజేపీ నాయకత్వం ముందు ఐదు డిమాండ్లు పెట్టినట్టుగా మరో వాదన ప్రచారంలోకి వచ్చింది. మహాయుతి కూటమి ప్రభుత్వానికి కన్వీనర్ గా షిండేను నియమించాలని డిమాండ్ తెరమీదికి తెచ్చారని అంటున్నారు. తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటున్నందుకు గాను తన కొడుకును సీఎం ను చేయాలని కూడా ఆయన బీజేపీ నాయకత్వం ముందు ప్రతిపాదించినట్టుగా వార్తలు వచ్చాయి. కళ్యాణ్ నియోజకవర్గం నుంచి షిండే కొడుకు ఎంపీగా ఉన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే మంత్రివర్గంలో హోంశాఖను షిండే వర్గం కోరుకుంటుంది.
కేంద్ర మంత్రివర్గంలోకి షిండేను తీసుకొంటే కీలకమైన మంత్రి పదవిని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ముంబై మున్సిపల్ మేయర్ పదవిని శివసేన షిండే వర్గం కోరుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది. అయితే బీఎంసీ ఎన్నికల్లో తామే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడంతో పాటు మేయర్ పదవిని కూడా తమకు ఇవ్వాలని షిండే వర్గం డిమాండ్ చేస్తుందనే ముంబై పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారంపై బీజేపీ నుంచి కానీ, షిండే వర్గం నుంచి కానీ స్పష్టత రాలేదు.
దేవేంద్ర ఫడ్నవీస్ వైపే బీజేపీ?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో దేవేంద్ర ఫడ్నవీస్ వైపే బీజేపీ నాయకత్వం మొగ్గుచూపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకత్వం కూడా ఫడ్నవీస్ ను సీఎం చేయడంపై ఏకాభిప్రాయానికి వచ్చారని బీజేపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
అయితే, షిండే అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారంతో సీఎం పదవికి కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ పేరు తెరమీదికి వచ్చింది. పుణె నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఏదైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఫడ్నవీస్ కు బదులుగా మరొకరిని సీఎం పదవి కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది.
బీజేపీకి 2019లో షాక్ ఇచ్చిన ఉద్ధవ్ ఠాక్రే
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఉమ్మడిగా పోటీ చేశాయి. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి 105, శివసేన 56 స్థానాల్లో గెలిచింది. ఎన్ సీ పీ 54, కాంగ్రెస్, 44, బహుజన వికాస్ అఘాడీ మూడు, ఎంఐఎం రెండు స్థానాల్లో, సమాజ్ వాదీ పార్టీ 2 స్థానాల్లో, సీపీఎం 1, ప్రహార్ జనశక్తి పార్టీ రెండు స్థానాల్లో, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ ఒక్క స్థానంలో గెలిచాయి. అయితే సీఎం పదవి విషయంలో బీజేపీ, శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కాంగ్రెస్, ఎన్ సీ పీ కూటమితో ఉద్ధవ్ ఠాక్రే చేతులు కలిపారు. ఈ సమయంలోనే మహావికాస్ అఘాఢీని ఏర్పాటు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022లో ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో శివసేన చీలిపోయింది. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు షిండే వైపు వెళ్లారు. దీంతో ఉద్ధవ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ మద్దతు ప్రకటించింది. కొన్ని రోజులకు ఎన్ సీ పీ అజిత్ పవార్ నేతృత్వంలో చీలింది. ఎన్ సీ పీలో మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గంలోకి ఫిరాయించారు. అజిత్ పవార్ కూడా షిండే కేబినెట్ లో చేరారు. ఈ మూడు పార్టీలు మహాయూతి పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమికి మహారాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని ఇచ్చారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే 2019 పరిణామాలు పునరావృతమౌతాయా అనే చర్చకు కారణమయ్యాయి.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కానీ, కొత్త సీఎం ఎంపికలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నవంబర్ 29న జరగాల్సిన మహాయుతి కూటమి నాయకుల సమావేశం రద్దైంది.సంపూర్ణ మెజారిటీ ఉన్నా కూడా మహారాష్ట్ర సీఎం పదవికి అభ్యర్ధిని ప్రకటించకపోవడంపై చర్చకు కారణమైంది. ఈ పరిణామాలను మహా వికాస్ అఘాడీ కూడా ఆసక్తిగా పరిశీలిస్తోంది.