Maharashtra Election Results 2024: రేపే ప్రమాణ స్వీకారం.. మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరంటే..

Who will be Maharashtra next CM : మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం ఎవరు? నిన్న ఎన్నికల ఫలితాల తరువాత మహయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండె, అజిత్ పవార్ ఒక జాయింట్...

Update: 2024-11-24 11:13 GMT

Maharashtra Election Results 2024: మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తోంది. రేపు సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని మంత్రి దీపక్ కెసార్కర్ మీడియాకు తెలిపారు. దీపక్ కెసార్కర్, ఏక్‌నాథ్ షిండే వర్గంలోని శివసేన నేత.రేపు కేవలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం మాత్రమే ఉంటుంది. కేబినెట్‌లో ఎవరెవరికి అవకాశం ఉంటుందన్న దానిపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయానికి రాలేదని దీపక్ అన్నారు.

ఇప్పటివరకు ఉన్న అప్‌డేట్స్ ప్రకారం ముఖ్యమంత్రి రేసులో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండె పోటీపడుతున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీనే అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్నందున కచ్చితంగా ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కే సీఎం అయ్యే అవకాశం దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Full View

మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం ఎవరు?

ఎన్నికల ఫలితాల తరువాత మహయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండె, అజిత్ పవార్ ఒక జాయింట్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరంటూ మీడియా వారిని ప్రశ్నించింది. అందుకు కూటమి నేతలు స్పందిస్తూ.. మిత్రపక్షాలు కలిసి మాట్లాడుకున్న తరువాత ఆ నిర్ణయాన్ని వెల్లడిస్తామని అన్నారు.

దేవేంద్ర ఫడ్నవిస్ ఏమన్నారంటే..

ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఎప్పుడూ వివాదం లేదని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఎన్నికల తరువాత మిత్రపక్షాలం కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముందు రోజు నుండే ఒక అభిప్రాయంతో ఉన్నట్లు ఫడ్నవిస్ చెప్పుకొచ్చారు.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 235 స్థానాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. అందులో ఒక్క బీజేపినే 132 స్థానాల్లో జండా ఎగరేసింది. రెండో స్థానంలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ సేనకు 57, మూడో స్థానంలో అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి 41 స్థానాలొచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ ఉద్ధవ్ థాకరే ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండేపై కామెంట్స్ చేశారు. ఇకపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అవుతారని.. అప్పుడు మళ్లీ మీరు ఫడ్నవిస్ కిందే పని చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

బాల్ థాకరే స్థాపించిన శివసేన పార్టీలోంచి ఏక్‌నాథ్ షిండే బయటికొచ్చేటప్పుడు పలు ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ థాకరే కింద పనిచేయలేనని అన్నారు. అందుకే ఆ పార్టీలో ఇక కొనసాగలేనని థాకరే స్థాపించిన శివసేన లోంచి బయటికొస్తూ ఇంకొంతమంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకొచ్చారు. బీజేపి, అజిత్ పవార్ వర్గంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. తాజాగా ఉద్ధవ్ థాకరే వర్గం కూడా ఆనాటి షిండే వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఇకపై ఫడ్నవిస్ కిందే పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News