మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

Update: 2019-11-12 12:30 GMT

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. అంతకు ముందు రాష్ట్రపతి పాలన విధించే అంశానికి కేంద్ర కేబినెట్‌ ప్రతిపాదించింది. ఎన్సీపీ మరింత గడువు కోరడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చిన గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారుసు చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో, కేంద్ర కేబినెట్‌ సిఫారసు, మహారాష్ట్ర గవర్నర్‌ నివేదిక ప్రస్తుతం రాష్ట్రపతి వద్దకు చేరాయి.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన తప్ప మరో అవకాశం లేదని నివేదికలో తెలిపారు గవర్నర్‌. ఈ అంశంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తప్పనిసరి. అందువల్ల గవర్నర్‌ కార్యాలయం ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర కేబినెట్‌ భేటీ అయి దీనిపై తీర్మానం చేసింది. కేంద్ర కేబినెట్‌ తీర్మానం ప్రతి, గవర్నర్‌ పంపిన నివేదిక ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌కు చేరాయి. పంజాబ్‌ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్‌ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్‌ సిఫారసు, కేంద్ర కేబినెట్‌ తీర్మానంపై రాష్ట్రపతి సంతకం పెట్టడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన అమలులోకి వచ్చినట్టయింది.

Tags:    

Similar News