Maharashtra Cabinet: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో వీడని సస్పెన్స్.. ఇంతకీ షిండేకు ఏ శాఖ రానుంది?

Update: 2024-12-12 07:45 GMT

Maharashtra cabinet expansion news: అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటికీ ఎన్నో చర్చల తర్వాత మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 5న ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మంత్రి పదవుల విషయంలో మాత్రం ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక పదవుల పంపకాలపై బీజేపీ నాయకత్వంతో చర్చలు జరపడానికి మహయుతి నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. అజిత్ పవార్ దేశ రాజధానిలో మకాం వేయగా.. సీఎం ఫడ్నవీస్ గత రాత్రి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలను కలిశారు. ఇక షిండే జాడ మాత్రం కనిపించలేదు. ఆయన ఢిల్లీ పర్యటనలో లేకపోవడం మరోసారి మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరికి ఏ పదవులు దక్కుతాయా అని మూడు పార్టీల నేతలు ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు సీఎం పదవి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే ఎట్టకేలకు షిండే ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేందుకు అంగీకరించడంతో గత వారం ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. తాను అడిగితేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు షిండే అంగీకరించారని ప్రమాణస్వీకారం చేసిన మరునాడే ఫడ్నవీస్ మీడియాకు తెలిపారు.

మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గ బెర్తులు ఖరారు అయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో బీజేపీకి సీఎంతో పాటు 21 మంత్రి పదవులు దక్కనుండగా.. శివసేనకు 12, ఎన్సీపీకి నుంచి 10 మందికి మంత్రులుగా అవకాశం దక్కనుందని టాక్ వినిపిస్తోంది.ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 43 మంది మంత్రులుగా ఉండవచ్చు. అయితే హోంశాఖ కావాలని షిండే పట్టుబట్టినట్టు తెలుస్తోంది. కానీ ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పులో షిండేకు ఏ పదవి దక్కుతుందో తెలియాల్సి ఉంది. ఇప్పుడు షిండే ఢిల్లీ పర్యటనలో లేకపోవడం ఆయన ఇంకా అసంతృప్తితోనే ఉన్నారనే వార్తలకు ఆజ్యం పోసినట్టైంది.

Tags:    

Similar News