రిటైర్మెంట్ రోజు లాస్ట్ ట్రిప్‌కు వెళ్లిన లోకో పైలట్... క్యాబిన్‌లో ఉండగా ఢీకొట్టిన గూడ్స్ రైలు
NTPC Loco pilot died on retirement day: ప్రమాదానికి గురైన రెండు గూడ్స్ రైళ్లు కూడా ఎన్టీపీసీ సంస్థకు చెందినవే.
రిటైర్మెంట్‌కు ముందుగా లోకో పైలట్‌గా అదే చివరి ట్రిప్... అంతలోనే గూడ్స్ రైలు ఢీకొట్టింది
Loco pilot died on retirement day in deadly trains collision
Loco pilot died on retirement day in deadly trains collision: విధి రాత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని పెద్దలు అంటుంటారు కదా... ఎన్టీపీసీలో గూడ్స్ రైలు లోకోపైలట్‌గా చేస్తోన్న గంగేశ్వర్ మల్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ఏప్రిల్ 1, మంగళవారం నాడు గంగేశ్వర్ రిటైర్మెంట్ కావాల్సి ఉంది. రిటైర్ అవ్వగానే అదే రోజు రాత్రి ఇంట్లో అందరం కలిసి డిన్నర్ చేద్దామని భార్య, కొడుకు, బిడ్డకు చెప్పారు. గంగేశ్వర్ రాక కోసం ఆ కుటుంబం ఆశగా, ఆతృతగా ఎదురుచూస్తోంది.
జీవితమంతా తమ కోసం కష్టపడి పనిచేసిన నాన్నకు రేపటి నుండి విశ్రాంతి లభిస్తోందని ఆ కుటుంబం ఆనందంగా ఉంది. ఆయన విశ్రాంత జీవితం హాయిగా ఉండాలని ఇంట్లో ఏవేవో ప్లాన్స్ చేస్తున్నారు. నాన్న కోసం ఎదురుచూస్తోన్న ఆ కుటుంబానికి నాన్నకు బదులుగా ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. "మంగళవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని బోగ్‌నది సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఆయన చనిపోయారు" అని ఫోన్ వచ్చింది. 30 ఏళ్లకుపైగా ఎన్టీపీసీ గూడ్స్ రైళ్లు నడిపిన గంగేశ్వర్‌కు అదే చివరి డ్యూటీ. తెల్లవారితే తను రిటైర్ కావాల్సిన వారు. కానీ ఆయనకు కుటుంబంతో కలిసి రెస్ట్ తీసుకునే అవకాశాన్ని ఆ దేవుడు ఇవ్వలేదు.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని ఫరక్కాలో ఉన్న ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్‌కు బొగ్గు తీసుకెళ్లే గూడ్స్ రైలుకు గంగేశ్వర్ లోకోపైలట్. ఫరక్కా వెళ్లి బొగ్గు అన్‌లోడ్ చేసి తిరిగి జార్ఖండ్‌కు వెళ్తున్న సమయంలో బరైత్ పోలీసు స్టేషన్ పరిధిలోని భోగ్‌నది సమీపంలోని సిగ్నల్ వద్ద ఆగారు. అదే సమయంలో ఎన్టీపీసీకే చెందిన మరో గూడ్స్ రైలు ఎదురుగా వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఇద్దరు లోకోపైలట్స్ అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని సాహెబ్‌గంజ్ డీఎస్పీ కిషోర్ టిర్కి చెప్పారు.
ఈ ఘటనపై ఈస్టర్న్ రైల్వే అధికార ప్రతినిధి కౌశిక్ మిత్రా స్పందిస్తూ, ఈ ప్రమాదంతో ఇండియన్ రైల్వేకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రమాదానికి గురైన రెండు గూడ్స్ రైళ్లు కూడా ఎన్టీపీసీ సంస్థకు చెందినవే. అలాగే ఆ రైలు మార్గం కూడా ఎన్టీపీసీదేనని మిత్రా తెలిపారు.