Oxygen Crisis: ఆక్సిజన్ లేక చనిపోవడం అంటే మారణహోమమే..అలహాబాద్ హైకోర్టు

Oxygen Supply Crisis: ఆక్సిజన్ ను సరఫరా చేయలేకపోవడం నేరపూరిత చర్యేనని అలాహాబాద్ కోర్టు అభిప్రాయపడింది.

Update: 2021-05-05 07:06 GMT

లక్నో హై కోర్ట్ 

Oxygen Supply Crisis: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో అనేక మంది కరోనా మహమ్మారి బారిన పడగా, చాలా మంది ఆక్సిజన్ అందక వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అలాహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా బాధితులు ప్రాణవాయువు దొరకక ఆసుప్రతుల్లో చనిపోన్నారన్న విషయం నిజంగా మారణహోమం లాంటిదే అని, ఇందుకు పాలకులదే బాధ్యతని హైకోర్టు పేర్కొంది.

ఆక్సిజన్ సప్లయ్ చైన్ ను నిర్వహించలేని అధికారులు, నేతలు అసమర్థులేనని పేర్కొంది. సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆక్సిజన్ లేకుండా కరోనా బాధితులు మరణిస్తున్నారని వచ్చిన వార్తలు, ప్రచారంపై స్పందించిన జస్టిస్ సిద్ధార్ద్ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్ ల ధర్మాసనం, కరోనా పరిస్థితులపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించింది.

లక్నో, మీరట్ జిల్లాల్లో ప్రాణ వాయువు సరఫరా అందక పలువురు మరణించగా, అన్ని కేసుల్లోనూ విచారణకు ఆదేశిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితిని వెంటనే సమీక్షించాలని, అవసరార్థులకు ఆసుపత్రుల్లో బెడ్లను, ఆక్సిజన్, వెంటిలేటర్లను అందించాలని ఆదేశించింది. "ఆక్సిజన్ అందక రోగులు మరణిస్తున్నారని విని మేము చాలా బాధపడుతున్నాం. ఇది మా మనసును కలచి వేస్తోంది. ఇది నిజంగా మారణ హోమం కన్నా తక్కువేమీ కాదు. మెడికల్ ఆక్సిజన్ ను నిర్వహించాల్సిన వారు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు.. ఈ సమయంలో ప్రజలు ముఖ్యంగా మహమ్మారి బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News