కోల్‌కతాలో భారీ వర్షాలు.. వరదల ధాటికి ఏడుగురు మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కోల్‌కతాను ముంచెత్తాయి. వరదల కారణంగా ఉత్తర కోల్‌కతాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కోల్‌కతాను ముంచెత్తాయి. వరదల కారణంగా ఉత్తర కోల్‌కతాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ షాక్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. వరదల్లో కొట్టుకుపోయి మరో నలుగురు మరణించారు. వానల వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి.
భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లల్లోనే ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. భారీ వరదల వల్ల షాహిద్ ఖుదిరామ్, మైదాన్ స్టేషన్ల మధ్య పలు రైల్వే కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.