Karnataka: రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. 224 స్థానాలకు పోలింగ్
Karnataka: ఈ నెల 13న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
Karnataka: రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. 224 స్థానాలకు పోలింగ్
Karnataka: కర్ణాటక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంటోంది. నిన్న సాయంత్రంతో ప్రచారం పర్వానికి తెరపడగా... రేపు పోలింగ్ జరగనుంది. హోరాహోరీ ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల మైకులన్నీ మూగబోయాయి. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా నుంచి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి కీలక నేతలంతా ఉద్ధృతంగా ప్రచారం చేశారు. నెల రోజులపాటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరి రోజు బీజేపీ కంటే కాంగ్రెస్ దూకుడుగా ప్రచారం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బెంగళూరులో విస్తృత ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు మొత్తం 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్ నేతలు 99 బహిరంగ సభలు, 33 రోడ్‌షోలు నిర్వహించారు. ప్రధాని మోడీ18 బహిరంగ సభలు, 6 రోడ్‌షోలలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎన్నడూ స్పష్టమైన మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీ... ఈసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రచారం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా ఈ ఎన్నికలను తమకు చావో రేవో అని అభివర్ణించారు. రాష్ట్రంలో జాతీయ పార్టీలకు పోటీగా బరిలోకి దిగిన జేడీఎస్ ఈసారి అస్తిత్వ పోరాటమే. ఓ ప్రాంతీయ పార్టీగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్న దార్శనితక తమకుందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఈసారి హంగ్‌తో సంబంధం లేకుండా 'కింగ్' కావాలన్న లక్ష్యంతో పని చేశామని, ఆ కష్టం ఈనెల 13న ఫలితాలద్వారా వ్యక్తం కానుందని పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ చివరి సభలో ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు మినహాయిస్తే ఇతర పార్టీల గొంతు ఈ ఎన్నికల్లో తక్కువగానే వినిపించింది. గత వారం బీఎస్‌పీ అధినేత్రి మాయావతి బెంగళూరులో చేపట్టిన ఒకే ఒక ప్రచార సభలో 130 మంది అభ్యర్థుల తరఫున మాట్లాడారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రెండుసార్లే రాష్ట్రానికి వచ్చి 220 మంది అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేవలం నలుగురినే బరిలో దింపిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఒక్కరోజే ప్రచారం చేశారు. జేడీఎస్‌కు మద్దతిస్తుందని భావించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలెవరూ ప్రచారానికి రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఎన్నికల్లో సందడి చేయలేదు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీకి చెందిన పాత, కొత్త నేతలు, వివిధ వర్గాల ప్రముఖులు 3వేల మందితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆదివారం 430 మందితో, శనివారం 450 మందితో ఆయన సంప్రదింపులు జరిపారు. మే 5న 500 మందిని ప్రధాని కలిశారు. సభలకు ముందు, వెనుక, విమాన ప్రయాణ సమయంలో ఈ భేటీలు జరిగాయి. మొత్తం 7 రోజులపాటు రాష్ట్రంలో ప్రధాని ప్రచారం నిర్వహించారు. 18 సభల్లో ఆయన ప్రసంగించారు. 6 రోడ్డు షోలలో పాల్గొన్నారు. అందులో మూడు బెంగళూరులోనే జరిగాయి.