కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటు?
DMK to offer Rajya sabha seat to Kamal Hassan: మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నట్టు చర్చ జరుగుతోంది. డీఎంకే ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర మంత్రి పీ.కే. శేఖర్ బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే డీఎంకే, ఎంఎన్‌ఎం మధ్య ఒప్పందం కుదిరిందనట్టు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఒక దానిని ఎంఎన్ఎంకు ఇచ్చేందుకు అప్పుడే ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటించిన కమల్.. డీఎంకే అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. దీంతో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలని డీఎంకే భావిస్తోంది. 2018 ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. గ్రామీణ ప్రాంతంలో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా ఒక్క సీటు గెలవలేకపోయింది.
ఇక కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్ బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటీ గెలవలేకపోయింది. 2024లో పార్లమెంటు ఎన్నికల్లో 39 స్థానాలు గెలవడానికి సహకారం అందించిన కమల్ హాసన్‌కు రాజ్యసభ సీటు ఇస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో జూన్ నెలలో తమిళనాడులో ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అందులో ఓ స్థానంలో కమల్ హాసన్‌ను డీఎంకే పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడు అన్నమలై దూకుడుతో కాషాయ పార్టీకి మద్దతు పెరుగుతుంది. అలాగే తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా పార్టీ పెట్టడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో వీరిద్దరిని ఎదుర్కోనేందుకు డీఎంకే కమల్ హాసన్‌ను తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.