JEE Advanced: రేపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష...వీటిపై పూర్తి నిషేధం..!!
JEE Advanced: రేపు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష...వీటిపై పూర్తి నిషేధం..!!
JEE Advanced: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 17వ తేదీ ఆదివారం నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు డిజిటల్ వాచ్ లే కాకుండా అనలాగ్ వాచ్ లు, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులను కూడా అనుమతించరు. విద్యార్థులు చెప్పులు, శాండిల్స్ మాత్రమే ధరించి రావాల్సి ఉంటుంది.
ఉంగరాలు, చెవిపోగులు, ముక్కుపుల్లలు, చైన్లు, నెక్లెస్లులు, బ్యాడ్జీలు, హెయిర్ పిన్నులను ధరించకూడదు. విద్యార్థులు అడ్మిట్ కార్డులతోపాటు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు మీద పేరెంట్ కూడా సంతకం చేయాలి. జేఈఈ మెయిన్ లో క్వాలిఫై అయిన 2.5లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. అడ్వాన్స్డ్ లో సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, పాలమూరు, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్ లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.