జయలలిత వేల కోట్ల ఆస్తులను ఇప్పుడేం చేస్తారు?
Jayalalitha properties documents: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు, ఆస్తుల పత్రాలను బెంగుళూరు కోర్టు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి ఫిబ్రవరి 15, 2025న అందించారు. ఇప్పటివరకు ఇవన్నీ బెంగుళూరు కోర్టు ఆధీనంలో ఉన్నాయి. జయలలిత ఆస్తుల విలువ ఎంత? జయలలిత ఆస్తుల కేసు ఎన్ని మలుపులు తిరిగింది? ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా ఈ కేసే కారణమా? ఆస్తుల కోసం కోర్టు మెట్లెక్కిన వారసులకు కోర్టుల నుంచి ఏం సమాధానం వచ్చింది? అనేక మలుపులు తిరిగిన జయలలిత ఆస్తుల కేసే ఈ ట్రెండింగ్ స్టోరీ.
జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు, ఆస్తుల పత్రాలను బెంగుళూరు ప్రత్యేక కోర్టు అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలున్నాయి. ఇక 1672 ఎకరాల వ్యవసాయ భూముల డాక్యుమెంట్స్, ఇళ్లకు సంబంధించిన దస్తావేజులను తమిళనాడు ప్రభుత్వానికి అందించారు. 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 91 చేతి గడియారాలు, 13 సూట్ కేసులు, 1040 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిజ్, విద్యుత్ పరికరాలు స్టాలిన్ ప్రభుత్వం తీసుకుంది. అప్పట్లో ఈ ఆస్తుల విలువ 913 కోట్లుగా అధికారులు నిర్దారించారు. అయితే ప్రస్తుతం దీని విలువ 4 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
జయలలితపై అక్రమ ఆస్తుల కేసు
తమిళనాడుకు ఆరుసార్లు జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె హీరోయిన్. 1991లో సీఎంగా ఆమె రూపాయి వేతనం తీసుకున్నారని చెబుతారు. ముఖ్యమంత్రి పదవి దిగిపోయేనాటికి ఆమె ఆస్తులు ఎలా పెరిగాయనే చర్చ తెరమీదికి వచ్చింది. 1991-92 ay 2.60 కోట్లు, 1992-93 నాటికి 5.82 కోట్లు, 1993-94 నాటికి 91.33 కోట్లకు పెరిగాయి. ఇక 1994-95 ఒక్క ఏడాదిలోనే మరో 38.21 కోట్ల రూపాయలు ఎలా పెరిగాయని 1996లో అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి జయలలితపై కేసు దాఖలు చేశారు. దీనిపై చెన్నైలోని ప్రత్యేక కోర్టు దర్యాప్తునకు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించిన అధికారులకు జయలలిత నివాసంలో బంగారం, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. అంతేకాదు జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ కూడా ఆస్తులు కూడబెట్టారని అధికారులు ఆధారాలు సేకరించారు. దీంతో ఈ కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లను కూడా చేర్చారు. ఈ నలుగురిపై 1997 జూన్ లో చార్జీషీట్ దాఖలైంది.
తమిళనాడు నుంచి కర్ణాటకకు కేసు బదిలీ
ఆదాయానికి మించి ఆస్తుల కేసు విచారణ 18 ఏళ్ల పాటు సాగింది. తమిళనాడులో ఈ కేసు విచారణ సాగితే సవ్యంగా సాగదని... వేరే రాష్ట్రంలో విచారించాలని డీఎంకె డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ డిమాండ్ ను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వాదనతో విబేధించిన జయలలిత బృందం కూడా తమిళనాడులోనే విచారణ కొనసాగేలా తమ ప్రయత్నాలు చేశారు. కానీ, సుప్రీంకోర్టు కర్ణాటకలో కేసు విచారణకు ఆదేశించింది. బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారించింది.
సీఎం పదవికి ఎసరు
2014 సెప్టెంబర్ 27న బెంగుళూరులోని ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెకు 100 కోట్లు జరిమానా విధించింది. ఈ తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని కోర్టు తెలిపింది. దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లారు. ఇదే కేసులో జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు కూడా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 10 కోట్లు జరిమానా విధించింది.
ఈ తీర్పును జయలలిత కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. ఈ తీర్పుపై వాదనలు విన్న హైకోర్టు జయలలితకు అనుకూలంగా తీర్పును వెల్లడించింది. 2015 మేలో కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్ధోషిగా తీర్పును వెల్లడించింది. ఆమెతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ కూడా ఈ కేసులో ఊరట దక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు విముక్తి లభించడంతో 2015 మే 23న ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 2017 ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టులో జయలలితకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. బెంగుళూరు ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైకేల్ డిగున్హా తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పు వచ్చే సమయానికి జయలలిత మరణించారు. దీంతో ఆమెపై అభియోగాలు రద్దు అవుతాయని కోర్టు తెలిపింది. ఆమెపై విచారణను నిలిపివేసినప్పటికీ ఆస్తుల జప్తును సుప్రీంకోర్టు సమర్థించింది.
జయ ఆస్తుల కోసం రంగంలోకి వారసులు
జయలలిత మరణించడంతో ఆమెకు సంబంధించిన ఆస్తులను తమకు ఇవ్వాలని వారసులుగా చెప్పుకుంటున్న దీప, దీపక్ కోర్టును ఆశ్రయించారు. 2023లో ఈ ఇద్దరు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. 2024 ఫిబ్రవరిలో 14, 15 తేదీల్లో ఈ ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అందించాలని సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. కానీ, ఈ నిర్ణయంపై దీప, దీపక్ కర్ణాటక హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు.
2025 జనవరి 13న ఈ ఇద్దరి పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. జయలలిత పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలని కూడా హైకోర్టు సూచించింది. ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు సేవ చేయవచ్చని సూచించింది. జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది.
జయలలిత అక్రమంగా సంపాదించిన ఆస్తులు ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లాయి. జయలలిత పేరు గుర్తుండేలా ఈ ఆస్తులను ఖర్చుచేస్తారా.. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులకు వినియోగిస్తారో వెయిట్ అండ్ సీ...