Jammu Kashmir: కిష్త్వార్‌లో క్లౌడ్‌బరస్ట్‌ బీభత్సం – 33 మంది మృతి, 220 మందికి పైగా గల్లంతు

జమ్మూకశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లా చోసిటి గ్రామంలో గురువారం భారీ మేఘాల విస్ఫోటం (క్లౌడ్‌బరస్ట్‌) సంభవించింది. దీనితో ఊహించని స్థాయిలో కురిసిన వర్షాలు ఆకస్మిక వరదలకు దారి తీసి, విస్తృత స్థాయిలో విధ్వంసం సృష్టించాయి.

Update: 2025-08-14 13:05 GMT

Jammu Kashmir: కిష్త్వార్‌లో క్లౌడ్‌బరస్ట్‌ బీభత్సం – 33 మంది మృతి, 220 మందికి పైగా గల్లంతు

జమ్మూకశ్మీర్‌ కిష్త్వార్‌ జిల్లా చోసిటి గ్రామంలో గురువారం భారీ మేఘాల విస్ఫోటం (క్లౌడ్‌బరస్ట్‌) సంభవించింది. దీనితో ఊహించని స్థాయిలో కురిసిన వర్షాలు ఆకస్మిక వరదలకు దారి తీసి, విస్తృత స్థాయిలో విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు ఇద్దరు CISF జవాన్లు సహా కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోగా, 120 మందికి పైగా గాయపడ్డారు. 220 మందికి పైగా ప్రజలు గల్లంతైనట్లు సమాచారం.

హిమాలయ ప్రాంతంలోని మాతా చండి దేవస్థానానికి వెళ్లే మచైల్ మాతా యాత్ర మార్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీర్థయాత్ర పూర్తిగా ఆగిపోయింది. సహాయక చర్యల కోసం రెస్క్యూ బృందాలు అత్యవసరంగా రంగంలోకి దిగి, బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి.

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించామని, పరిస్థితి నియంత్రణకు అన్ని వనరులు వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై స్పందించి, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

క్లౌడ్‌బరస్ట్ అంటే ఏమిటి?

భారత వాతావరణ శాఖ ప్రకారం, చాలా స్వల్ప సమయంలో భారీ వర్షపాతం నమోదవడాన్ని మేఘాల విస్ఫోటం లేదా క్లౌడ్‌బరస్ట్‌గా పిలుస్తారు. సాధారణంగా 20–30 చ.కి.మీ పరిధిలో గంటలో 10 సెం.మీ (100 మి.మీ) కంటే ఎక్కువ వర్షం పడితే, దాన్ని క్లౌడ్‌బరస్ట్‌గా పరిగణిస్తారు. ఒక్కోసారి ఉరుములు, పిడుగులతో కూడిన ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారి తీస్తాయి. రెండు గంటలలో 5 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం పడితే, దాన్ని మినీ క్లౌడ్‌బరస్ట్‌గా వ్యవహరిస్తారు. అయితే, అన్ని భారీ వర్షాలను క్లౌడ్‌బరస్ట్‌గా పరిగణించరు — కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితులలో మాత్రమే ఈ విపత్తు సంభవిస్తుంది.

Tags:    

Similar News