ఇస్రో చరిత్రలో కొత్త అధ్యాయనికి నాంది

* ప్రైవేట్ శాటిలైట్‌లను అంతరిక్షంలోకి పంపిస్తున్న ఇస్రో * భగవద్గీత, ప్రధాని మోడీ ఫొటోలను పంపిస్తున్న ఇస్రో

Update: 2021-02-16 02:07 GMT

ఫైల్ ఇమేజ్ (ది హన్స్ ఇండియా)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త ప్రయోగాల పరంపరకు తెర లేపుతోంది. ఇప్పటికే ఇస్రో నుంచి ప్రైవేటు ఉపగ్రహ వాహక నౌక అంతరిక్షంలోకి పంపుతున్నది.. ఈ సారి భారత ఇతిహాస గ్రంథాలను దేశం కోసం శ్రమించిన నేతలు, మహానీయుల ఫొటోలను అంతరిక్షంలో నిక్షిప్తం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భారత దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి మహనీయులతో పాటు దేశ పౌరులు, ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలను కూడా ఇందులో పంపుతోంది. ఈ నెల 28న ప్రైవేట్ శాటిలైట్ ద్వారా ఇవి పంపేందుకు రెడీ అవుతోంది.

కరోనా మహమ్మారితో అంతరిక్ష ప్రయోగాలకు కొన్నాళ్ల పాటు విరామం ఇచ్చిన ఇస్రో.. ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి సిద్ధమైంది. 50 ఏళ్ల ఇస్రో చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. ఇందులోని ఒక శాటిలైట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటో, భగవద్గీత కాపీ, 25 వేల మంది పౌరుల పేర్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు.

ఈ నెల 28న పీఎస్ఎల్‌వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమోజానియా -1, భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. భారతీయ ఉపగ్రహాల్లో ఆనంద్‌ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్ రూపొందించింది. సతీశ్ ధావన్‌ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించింది. యునిటీశాట్‌ను జిట్‌శాట్, జీహెచ్ఆర్‌సీఈ శాట్‌, శ్రీశక్తి శాట్ కాలేజీ విద్యార్థులు రూపొందించారు.

ప్రముఖ భారత అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్ ధావన్ పేరు మీదుగా స్పెస్ కిడ్జ్ ఇండియా సతీష్ ధావన్ ఉపగ్రహాన్ని రూపొందించింది. తమ సంస్థ నుంచి నింగిలోకి వెళ్తున్న తొలి ఉపగ్రహం కావడంతో ఈ ప్రయోగానికి మరింత ప్రత్యేకత తీసుకురావాలని స్పెస్‌కిడ్జ్ ఇండియా భావించింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ ఫొటో ఉపగ్రహంలో పంపనున్నట్లు సంస్థ సీఈవో డాక్టర్ కేసన్ తెలిపారు.

విదేశాలకు చెందిన కొన్న ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. అందుకే తాము భారతీయుల పవిత్ర గ్రంథం భగవద్గీతను పంపించాలనుకుంటున్నామని డాక్టర్ కేసన్ వెల్లడించారు.

మొత్తానికి ఇస్రో చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. తొలిసారి ప్రైవేట్ సంస్థకు చెందిన శాటిలైట్‌ను పంపిస్తున్నారు. ఈ ప్రయోగం ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు ప్రయోగించనున్నట్టు ఇస్రో పేర్కొంది. 

Tags:    

Similar News