Caste Census: కులగణనతో లెక్కలు పక్కాగా తేలేనా? క్రెడిట్ బీజేపీకా? కాంగ్రెస్‌కా?
Caste Census: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి దాకా కులగణనకు డిమాండ్ చేస్తూ వచ్చిన కాంగ్రెస్‌ను రాజకీయంగా తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్’ అని భావిస్తున్నారు.
Caste Census: కులగణనతో లెక్కలు పక్కాగా తేలేనా? క్రెడిట్ బీజేపీకా? కాంగ్రెస్‌కా?
Caste Census: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి దాకా కులగణనకు డిమాండ్ చేస్తూ వచ్చిన కాంగ్రెస్‌ను రాజకీయంగా తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్’ అని భావిస్తున్నారు. కులగణనకు మోదీ సర్కారు అంగీకరించడం తమ విజయమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కులగణన విషయంలో మొసలికన్నీళ్లు కారుస్తోందని, వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. బీహార్ ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నా కులగణన పరిణామాలు ఎలా ఉండబోతాయనే చర్చ మొదలైంది.
కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశంలో త్వరలో మొదలయ్యే2025లో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించింది . ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతోపాటు.. ఎన్డీయే కూటమి చేతిలో ఉన్న బిహార్ కూడా కులగణన చేపట్టింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని వైపులనుంచి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలు సుప్రీంకోర్టుకూ వెళ్లాయి. దాంతో పార్లమెంటులో దీనిగురించి వివిధ పక్షాలు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు సమాధానం ఇచ్చింది.
కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం ‘గణన’అనేది కేంద్ర జాబితాలో 69వ అంశంగా ఉందని, అందువల్ల జనగణన, కులగణన బాధ్యత పూర్తిగా కేంద్రం పరిధిలోనిదని స్పష్టంచేశారు సమాచారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. కొన్ని రాష్ట్రాలు తమకు అధికారాలు లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలను అశాస్త్రీయంగా సేకరించాయని ఆరోపించారు. ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూడదన్న ఉద్దేశంతోనే పక్కా శాస్త్రీయంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
కులగణన అంశాన్ని పరిశీలించేందుకు కేంద్రం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటుచేసింది. అప్పట్లో అత్యధిక రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తంచేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం కులగణనకు బదులు ‘సామాజిక, ఆర్థిక కుల గణన’ (ఎస్‌ఈసీసీ) నిర్వహించింది. కాంగ్రెస్, విపక్ష కూటమి పార్టీలు కులగణన అంశాన్ని కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటూ వచ్చాయి. రాజ్యాంగం ప్రకారం జనగణన పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అయినప్పటికీ పలు రాష్ట్రాలు సర్వే రూపంలో కులగణనను చేపట్టాయి. కొన్ని సక్రమంగా చేసినా, మరికొన్ని మాత్రం పారదర్శకత లేకుండా రాజకీయ దృష్టితో వ్యవహరించాయి. మేం కులగణనను ఒక సర్వేలా కాకుండా జనగణనలో భాగంగానే పారదర్శకంగా సమ్మిళితం చేయాలని నిర్ణయించాం. సామాజిక విలువలు, ప్రయోజనాలను కాపాడటానికి కేంద్రం కట్టుబడి ఉందని ఈ నిర్ణయం నిరూపించింది’’ అని అశ్వినీవైష్ణవ్ వివరించారు.
కులగణనకు ప్రభుత్వం అంగీకరించడం తమ విజయమని, తమఒత్తిడికి ఎట్టకేలకు బీజేపీ తలొగ్గిందని ప్రధాన విపక్షం హర్షం వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్షం చేశారు. ‘‘మేం కులగణన చేసి చూపిస్తామని పార్లమెంటులో చెప్పాం. రిజర్వేషన్లపై నిర్మించిన 50 శాతం కృత్రిమ గోడను కూడా కూలగొడతామని కూడా స్పష్టం చేశాం. ఇప్పటివరకు కేవలం నాలుగు జాతులే ఉన్నాయని చెబుతూ వచ్చిన ప్రధాని మోదీ.. అకస్మాత్తుగా 11 ఏళ్ల తర్వాత కులగణన ప్రకటన చేశారు. దీనికి మేం పూర్తిగా మద్దతు పలుకుతున్నాం. అయితే దీన్ని ఎప్పటిలోపు పూర్తి చేస్తారన్నది తెలుసుకోవాలనుకుంటున్నాం.. అని ప్రకటించారాయన.. తెలంగాణలో ఇప్పటికే చేపట్టిన కులగణన ప్రక్రియ ఇందుకు నమూనాగా నిలుస్తుందన్నారు.
కులగణనను పారదర్శకతతో పని ప్రారంభించడానికి కేంద్రం సత్వరం నిధులు కేటాయించాలని కాంగ్రెస అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. చాలాకాలం నుంచి తాము చేస్తున్న డిమాండుపై ఇప్పటికైనా కేంద్రం స్పందించడం సంతోషకరమని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. కులగణన అవసరమని, గత 30 ఏళ్లుగా దీనిని కోరుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ గుర్తుచేశారు. కుల ప్రాతిపదికన లెక్కల కోసం డిమాండ్ చేస్తే తమకు కులతత్వాన్ని ఆపాదించినవారికి ఇప్పుడు సరైన సమాధానం దొరికిందన్నారు.ఇది 100% విపక్ష కూటమి విజయమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తెలిపారు
అయితే కులగణన విషయంలో కాంగ్రెస్, విపక్ష నేతలు తమపై చేసిన ఆరోణలను తప్పికొట్టారు బీజేపీ నేతలు. కుల గణనను కాంగ్రెస్ రాజకీయ ఆయుధంగా మాత్రమే ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు కుల గణనను వ్యతిరేకించాయని బీజేపీ ఆరోపిస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత జరిగిన అన్ని జనాభా లెక్కల్లో కులాలను లెక్కించలేదని అన్నారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. కులాల సరైన జనాభా గణన నిర్వహించాలనే ఉద్దేశ్యాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ చూపించలేదని, 2010లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభలో కుల గణనను కేబినెట్‌లో పరిశీలిస్తామని చెప్పారని, అయితే దీని తర్వాత ఒక కేబినెట్ గ్రూప్ మాత్రమే ఏర్పడిందని, ఆ కమిటీ సిఫార్సులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల డేటాను సేకరించడానికి బదులుగా సామాజిక-ఆర్థిక సర్వే మాత్రమే నిర్వహించిందని బీజేపీ ఆరోపించింది. కేంద్ర నిర్ణయంపై బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హర్షం వ్యక్తంచేశారు. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ మేరకు స్పందించారు.ఇదొక చరిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుందని, సమాజంలో అన్ని వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వ కట్టుబాటును ఇది సూచిస్తోందని పేర్కొన్నారు.
మరోవైపు జన గణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి . కులగణన కోరుతూ రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. మాట్లాడారు. కులగణన విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విషయంలో దేశానికి మార్గదర్శకంగా నిలిచామన్నారు రేవంత్. కులగణన విషయంలో కేంద్రమంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలి. అందులో కేంద్రమంత్రులు, సీనియర్ అధికారులను నియమించాలి అని సూచించారు. తెలంగాణ మోడల్ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీని పంపాలి. ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలి. స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలి’’ అని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ సూచించారు.
కాగా కాంగ్రెస్ పార్టీ కులగణన విషయంలో మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాహుల్, రేవంత్ కాంగ్రెస్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు.60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ అప్పుడెందుకు కులగణన చేయలేదని ప్రశ్నించారు. బీసీ సంక్షేమం కోసం ఇచ్చిన నివేదికలను పక్కనబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం..15 ఏళ్లు నెహ్రూ, 16 ఏళ్లు ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్నారు.. కానీ బీసీల సంక్షేమం కోసం వేసిన కమిటీ సూచనల్ని పక్కనబెట్టారు..మండల్ కమిటీ నివేదిక పార్లమెంట్‌లో ప్రవేశపెడితే రాజీవ్ గాంధీ వ్యతిరేకించారని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంలో జనగణన చేశారే తప్ప కులగణన చేయలేదని విమర్శించారు లక్ష్మణ
ఇటీవలి కాలంలో లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఎక్కడ పర్యటించినా కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. తన ప్రభుత్వం ఏర్పడితే కుల గణన నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తి వేస్తామని చెప్పారు. ఈ ఏడాది చివర్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా కులగణనకు ఆమోదం తెలిపింది.
ఎత్తులు పైఎత్తులతో అనూహ్య నిర్ణయాలు తీసుకోవటం రాజకీయాల్లో సహజం. కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇలాగే అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి బీహార్ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం రాజకీయంగా చాలా కీలకంగా మారనుంది. వాస్తవానికి కులగణనపై బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టం చెప్పకున్నా.. ఆ పార్టీ ఇందుకు వ్యతిరేకం అనే ప్రచారం జరిగింది. కులగణనకు తొలి ప్రధాని నెహ్రూ వ్యతిరేకమని, రిజర్వేషన్లను రాజీవ్‌గాంధీ లోక్‌సభలోనే వ్యతిరేకించారంటూ బీజేపీ నేతలు విమర్శలు కురిపించారు. మండల్ కమిషన్ సిఫార్సులను ఇందిరాగాంధీయే తొక్కిపట్టారని ఆరోపణలూ ఎక్కుపెట్టారు. అయితే కాంగ్రెస్ ఎక్కుపెట్టిన కులగణన అస్త్రం భవిష్యత్తులో రాజకీయంగా మళ్లీ ఇబ్బంది పెట్టకుండా దాన్ని ఒడుపుగా అందుకుని తనకు ఉపకరించే రీతిలో ప్రయోగించుకోటానికి బీజేపీ సిద్ధమైంది. దీనిలో ఎంతవరకూ సఫలమవుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ కులగణనపై కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో రాజకీయంగా మరింత విజృంభించకుండా బీజేపీ పావులు కదిపిందని భావిస్తున్నారు
మనదేశంలో 1881లో జనాభా లెక్కల సేకరణ మొదలైంది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. ఈ జనగణనలో ప్రజల సంఖ్యతోపాటు వారి ఆర్థిక స్థితి, జనాభా పెరుగుదల రేటు, మహిళలు– పురుషుల సంఖ్య, లింగ నిష్పత్తి, జనన– మరణాల రేటు వంటి సకల వివరాలను రికార్డు చేస్తున్నారు. నిజానికి మొదటి జనగణనతోపాటే.. కులగణన కూడా నిర్వహించారు. 1931 వరకు ఈ విధానం కొనసాగింది. ఆ తర్వాత జనగణన నుంచి కులగణనను తప్పించారు. కానీ, ఎస్సీ, ఎస్టీల సంఖ్యను మాత్రం లెక్కిస్తూ వస్తున్నారు. దీంతో ఓబీసీ, ఓసీల జనాభా ఎంత ఉందన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ పర్యవేక్షణలో జనాభా లెక్కలు నిర్వహిస్తారు. దేశంలో చివరి జనగణన 2011లో జరిగింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు జనగణన, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) నమోదు చేపట్టాలని నిర్ణయించారు. రూ.8,754 కోట్లతో జనగణన, రూ.3,941 కోట్లతో ఎన్‌పీఆర్ నవీకరణ ప్రతిపాదనలకు 2019 డిసెంబరులో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది. ఐదేళ్లు దాటిపోతున్నా.. ఎప్పుడు చేపడతారనేదానిపై కేంద్ర హోంశాఖ ఎటువంటి ప్రకటనలు చేయలేదు. సరైన సమయంలో నిర్వహిస్తామని 2024లో ఓ సందర్భంలో కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు.
మనదేశంలో జనగణన సుదీర్ఘ ప్రక్రియ. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ మొదలు.. పూర్తి డేటాను ప్రకటించటానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో జనాభా లెక్కలకు కేవలం రూ.574 కోట్లే కేటాయించడంతో.. ఈ ఏడాదైనా నిర్వహిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, బడ్జెట్ కేటాయింపు అనేది చిన్న సమస్యేనని, సులభంగా పరిష్కరించుకోవచ్చని సంబంధిత అధికారి తెలిపారు. జనగణనతోపాటు ఎన్‌పీఆర్ నిర్వహణకు రూ.13 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా. ఎప్పుడు చేపట్టినా.. ఇది మొదటి డిజిటల్ జనగణన అవుతుంది. పౌరులకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ సిబ్బంది ద్వారా కాకుండా సొంతగా వివరాల నమోదుకు ఎన్‌పీఆర్ తప్పనిసరి. ఆధార్ లేదా ఫోన్ నంబర్ అవసరం. దీనికోసం ఓ పోర్టల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి 30కిపైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్లు సమాచారం. టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, వాహనాలు, వంటగ్యాస్ కనెక్షన్, తాగునీటికి ప్రధాన ఆధారం, కిచెన్, ఇల్లు పరిస్థితి, ఇంట్లో ఎంతమంది ఉంటారు? తదితర ప్రశ్నలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.