Cricket Betting: అప్పులు తీర్చలేక కొడుకు సూసైడ్.. మనస్తాపంతో ఆగిన తల్లి గుండె..

తాజాగా ఐపీఎల్ లో బెట్టింగ్ కట్టి ఓ యువకుడు ప్రాణాలు తీసుకుంటే..కొడుకు మరణించాడనే మనస్థాపంలో తల్లి కూడా తనువు చాలించింది.

Update: 2023-05-24 09:24 GMT

Cricket Betting: అప్పులు తీర్చలేక కొడుకు సూసైడ్.. మనస్తాపంతో ఆగిన తల్లి గుండె

Cricket Betting: ఐపీఎల్ పోటీలు ఫైనల్ స్టేజ్ కు రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోవైపు ఈ పోటీలపై బెట్టింగ్ రాయుళ్లు కాయ్ రాజా కాయ్ అంటూ కోట్లలో బెట్టింగులు కాస్తున్నారు. ఇందులో కాసులు రాలే వాళ్లు ఎంజాయ్ చేస్తుంటే..ఓడిపోయిన వాళ్లు మాత్రం డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఐపీఎల్ లో బెట్టింగ్ కట్టి ఓ యువకుడు ప్రాణాలు తీసుకుంటే..కొడుకు మరణించాడనే మనస్థాపంలో తల్లి కూడా తనువు చాలించింది. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే:

మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ఖితాన్ వాధ్వానీ అనే యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. తండ్రి హోల్ సేల్ వ్యాపారీ. ఖితాన్ కు చదువు అబ్బకపోగా చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సందర్భంగా భారీ మొత్తంలో బెట్టింగులు కట్టాడు. ఓడిపోవడంతో అప్పుల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఖితాన్ తల్లి దివ్య అతడిని మందలించింది. దీంతో నిరాశకు గురైన ఖితాన్ ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటికి తిరిగివచ్చిన కుటుంబసభ్యులకు ఖితాన్ ఉరికి వేలాడుతూ కనిపించేసరికి దిగ్ర్భాంతికి గురయ్యారు. చేతికి అందిరావాల్సిన కొడుకు ఇలా అర్థాంతరంగా చనిపోవడంతో ఖితాన్ తల్లి తట్టుకోలేకపోయింది. కొడుకు పార్థివ దేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ క్రమంలోనే దివ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మొత్తంగా, ఎంతోమంది యువకులు బెట్టింగులకు బానిసలుగా మారి ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు.

Tags:    

Similar News