India bans Pakistani YouTube channels: కేంద్రంలో మరో కీలక నిర్ణయం..16 పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్
India bans Pakistani YouTube channels: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై తీవ్ర చర్యలు తీసుకుంటున్న కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోంమంత్రిత్వ శాఖ సిఫార్సులతో పాకిస్తాన్ కు చెందిన 16 యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించింది. వీటిలో డాన్, సామాటీవీ, ఏఆర్ వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్ , ఇర్షాద్ భట్టి, ఆస్మా షిరాజీ, ఉమర్ చీమా, మునీబ్ ఫరూఖ్, బోల్ న్యూస్, రాఫ్తార్, సునో న్యూస్, పాకిస్తాన్ రిఫరెన్స్, సామా స్పోర్ట్స్ , ఉజైర్ క్రికెట్ వంటి ఛానెళ్లు ఇందులో ఉన్నాయి.
పహల్గామ్ దాడి అనంతరం ఈ చానెల్లు భారత్ పై విషం చిమ్ముతున్నాయని..రెచ్చగొట్టే విధంగా తప్పుడు వ్యాఖ్యలు ప్రసారం చేస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ లో 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీరీని ఉగ్రవాదులు కాల్చి చంపిన అనంతరం..భారతదేశం దాని సైన్యం, భద్రతా సంస్థలను రెచ్చగొట్టే విధంగా ఈ యూట్యూబ్ ఛానెల్స్ వార్తలను ప్రసారం చేస్తున్నాయి. అంతేకాదు సెన్సిటివీ కంటెంట్ పై తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వాటిని నిషేధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.