రక్తం ఓడుతున్న గాయాలు.. పగిలిన తలలు! జిమ్ మాఫియా దెబ్బకు ఓ కుటుంబం చిన్నాభిన్నం!

దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పట్టేలా ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

Update: 2026-01-05 10:28 GMT

దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పట్టేలా ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఒక కుటుంబంపై కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. జిమ్ ఆక్రమణ కోసం జరిగిన ఈ గొడవలో యజమాని దంపతులతో పాటు వారి కుమారుడిని కూడా వదలకుండా అమానుషంగా వేధించారు.

అసలేం జరిగింది?

బాధితుడు రాజేశ్‌ గార్గ్ తన ఇంటి బేస్‌మెంట్‌లోనే ఒక జిమ్ నిర్వహిస్తున్నారు. ఆ జిమ్‌కు కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న సతీశ్‌ యాదవ్ అనే వ్యక్తి, ఆ జిమ్‌ను అక్రమంగా తన వశం చేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జనవరి 2న బేస్‌మెంట్‌లో నీటి లీకేజీని పరిశీలించేందుకు గార్గ్ దంపతులు వెళ్లగా, సతీశ్‌ యాదవ్ తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు.

నడిరోడ్డుపై నగ్నంగా మార్చి దాడి

రాజేశ్‌ గార్గ్‌ను నిందితులు కిందపడేసి చితకబాదడమే కాకుండా, అడ్డువచ్చిన ఆయన భార్యను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి వేధించారు. తల్లిదండ్రులను కాపాడేందుకు వచ్చిన కుమారుడి పట్ల నిందితులు మరింత క్రూరంగా ప్రవర్తించారు. అతడిని బయటకు లాక్కెళ్లి, అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై బట్టలు విప్పి (నగ్నంగా మార్చి) ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో యువకుడి తలకు తీవ్ర గాయాలవగా, ఒక పన్ను విరిగిపోయింది. రాజేశ్ గార్గ్ ముఖంపై కూడా బలమైన గాయాలయ్యాయి.

సిసిటివి ఫుటేజీ ఆధారంగా అరెస్టులు

ఈ భయానక దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ (CCTV) కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ప్రధాన నిందితుడు సతీశ్‌ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితులు వికాస్ యాదవ్, శుభమ్ యాదవ్, ఓంకార్ యాదవ్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.


Tags:    

Similar News