America Weather: అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న మంచు తుపాను

అగ్రరాజ్యం అయిన అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది

Update: 2021-02-18 05:37 GMT

అగ్రరాజ్యాన్ని వణికిస్తోన్న మంచు తుపాను

అగ్రరాజ్యం అయిన అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. టెక్సాస్‌, ఒక్లాహామా, టెన్నెసీ, ఇల్లినాయిస్‌ వంటి పలు రాష్ట్రాలు తుపాను దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ విపత్తు కారణంగా ఇప్పటి వరకు దాదాపు 20 మంది మరణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వల్ల 40 లక్షల ఇళ్లు, దుకాణాలపై ప్రభావం పడింది. మరోవైపు రక్తం గడ్డం కట్టించే చలిని ఎదుర్కొనే హీటర్లు పనిచేయక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులు మంచుతో నిండిపోయిన పరిస్థితుల్లో అనేక మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. ''పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదం ఉండడంతో విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే వీలైనంత వరకు కరెంటు సరఫరాను నిలిపి వేయడమే మంచిది'' అని అధికారులు పేర్కొంటున్నారు. చలి పులిని ఎదుర్కొనేందుకు టెక్సాస్‌ రాష్ట్ర అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామన్నారు. హ్యూస్టన్‌లో ఒక కుటుంబం వారి గ్యారేజీలోని కారు ఎగ్జాస్ట్‌ నుండి కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదల కారణంగా మంటలు వ్యాపించి ఒకరు మృతి చెందారు. అయితే టెక్సాస్‌లో దాదాపు ఆరు లక్షల గృహాలు, వాణిజ్య వాప్యార సంస్థలకు విద్యుత్తును పునరుద్ధరించినట్లు పవర్‌గ్రిడ్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు టీకా పంపిణీకి అడ్డంకిగా మారాయి.

Tags:    

Similar News