చెన్నైని వణికించిన భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం.. రెడ్ అలర్ట్ ..

Heavy Rains - Chennai: సహాయక చర్యలపై సమీక్షించిన ముఖ్యమంత్రి స్టాలిన్...

Update: 2021-12-31 02:56 GMT

చెన్నైని వణికించిన భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం.. రెడ్ అలర్ట్ ..

Heavy Rains - Chennai: భారీ వర్షాలతో తమిళనాడులోని చెన్నై మహానగరం మరోసారి అతలాకుతలం అయింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షాలకు చెన్నై పూర్తిగా నీట మునిగింది. బలమైన ఈదురు గాలులు వీస్తూ ఆకస్మికంగా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల నేపధ్యంలో చెన్నైలోని ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి స్టాలిన్.. సహాయక చర్యలపై సమీక్షించి, అధికారులను అప్రమత్తం చేశారు.

మరోవైపు.. భారీ వర్షాల దెబ్బకు సాయంత్రం నుంచి రాత్రి 8.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రధానింగా మౌంట్ రోడ్, పూనమల్లి రోడ్‌లో కిలోమీటర్లకొద్దీ వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. రాత్రి 9గంటల తర్వాత కూడా పలుచోట్ల వర్షం కురవడంతో మూడు సబ్‌వేలను నిలిపివేశారు. కేకే నగర్, మైలాపూర్, సెంబియం, నుంగంబాక్కం, అశోక్ నగర్ తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా.. 14 రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్‌ను మళ్లించారు.

ఇటీవల చెన్నైలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు చేయడంతో ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఇదే సమయంలో మెట్రో పనులు కూడా జరుగుతుండటంతో వడపళనిలో వరదనీరు భారీగా వచ్చి చేరింది. అటుగా వెళ్లే వాహనదారులు రోడ్డు దాటలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక.. భారీ వర్షాల కారణంగా తమిళనాడు వ్యాప్తంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. జ‌ల‌మ‌య‌మైన రోడ్ల నుంచి నీటిని తొల‌గించ‌డానికి అధికారులు మోటారు పంపుల‌ను ఉప‌యోగిస్తున్నారు. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్రజ‌లు జాగ్రత్తగా ఉండాలనీ, వాహ‌న‌దారులు సుర‌క్షిత మార్గాల‌ను ఎంచుకోవాల‌ని అధికారులు సూచించారు.

ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెన్నై వాసులకు ఐఎండీ షాకిచ్చింది. రానున్న రెండు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ అంచ‌నా వేసింది. చెన్నై న‌గ‌రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో అతిభారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ఇక.. ఎంఆర్‌సీ నగర్‌లో 198 మిల్లీమీటర్లు, నుంగంబాక్కంలో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగళ్‌పట్టుకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Tags:    

Similar News