Farmers Protest: ఢీల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు పెరుగుతున్న మద్దతు

* ట్విటర్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా మద్దతు * చెక్కుచెదరని సంకల్పంతో రైతుల ఆందోళన * విదేశీయులపై కౌంటర్ ఎటాక్ చేస్తున్న భారత నెటిజన్లు

Update: 2021-02-05 04:13 GMT

Farmers Protest (file Image)

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పెరుగుతోంది. ట్విట్టర్ వేదికగా పెద్ద సోషల్ వార్ నడుస్తోంది. రైతుల ఉద్యమానికి కొంతమంది సపోర్ట్ చేస్తే.. భారత్‌ అంతర్గత విషయాలపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. నిన్న ఉదయం వర్షం పడింది. అడుగుదాటి ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇవేవీ రైతుల దృఢ సంకల్పాన్ని నిలువరించలేకపోతున్నాయి. మొక్కవోని దీక్షతో అన్నింటినీ భరిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో నిద్రిస్తున్నారు. చాలా మంది రైతులు ట్రాక్టర్ ట్రాలీల్లోనే గడుపుతున్నారు.

మరోవైపు రైతులకు మద్దతు ప్రకటించేందుకు ఢిల్లీ సరిహద్దులకు వెళ్లిన విపక్షా సభ్యులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎంపీల బస్సుకు అడ్డుగా బారికేడ్లు పెట్టి ఘాజీపూర్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో 10 పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు రైతులను కలవకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. బారికేడ్లు తీస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని పోలీసులు చెప్పడంతో ఎంపీలు అక్కడి నుంచి అసంతృప్తితో వెనుతిరిగారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను కలవనివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు.

 ఈ నెల 6న రహదారుల దిగ్బంధనానికి రైతులు సంఘాలు సిద్ధమవుతున్నాయి. రాస్తారోకో కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. రాస్తారోకో సందర్భంగా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు భద్రత దళాలూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించేందుకు ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఢిల్లీ సీపీ, ఇంటలిజెంట్ వర్గాలు సమావేశం అయ్యాయి.

సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండు చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును రాజ్యసభలో ప్రతిపక్షాలు తూర్పారబట్టాయి. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా కేంద్రాన్ని నిలదీశాయి. రైతులతో పోరాటం చేయడమేమిటని ప్రశ్నించాయి. ఒక్క ట్వీట్‌కే వణికిపోవడం ఎందుకని ప్రశ్నించాయి. మరోవైపు అధికార పక్ష సభ్యులు సాగు చట్టాలను సమర్ధించారు.. వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకంగా చర్చ జరపాలని డిమాండు చేస్తూ ప్రతి పక్షాలు వరుసగా మూడో రోజు కూడా లోక్‌సభలో ఆందోళన చేశాయి. దీంతో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడింది.

Tags:    

Similar News