ఆర్మీలో యువ రక్తం నింపనున్న కేంద్రం.. యువత కోసం ప్రత్యేకంగా ఆర్మీ నియాకాలు

Agnipath Army Scheme: సాయుధ బలగాల్లో యువతకు అవకాశమివ్వడానికే అగ్నిపథ్‌ను తెచ్చినట్టు తెలిపిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌

Update: 2022-06-14 11:30 GMT

ఆర్మీలో యువ రక్తం నింపనున్న కేంద్రం.. యువత కోసం ప్రత్యేకంగా ఆర్మీ నియాకాలు

Agnipath Army Scheme: త్రివిధ దళాలు, సాయుధ బలగాల్లో యువ రక్తాన్ని నింపేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అగ్నిపథ్‌ పేరుతో కొత్త స్కీమ్‌ను తాజాగా ప్రకటించింది. నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు నియామక ప్రాణాళికను త్రివిధ దళాధిపతులతో కలిసి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. అగ్నిపథ్‌ పథకంలో సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశం లభిస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. యువతను ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తామన్నారు. అగ్నిపథ్‌లో చేరే యుతను అగ్నివీరులుగా పిలవనున్నట్టు తెలిపారు. నాలుగేళ్ల తరువాత సైన్యం నుంచి దేశ రక్షణను మరింత బలోపేతం చేయనున్నట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి వివరించారు. వెనక్కి వచ్చిన వారికి పలు రంగాల్లో కొత్త నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

సాధారణంగా ఆర్మీ నియాకాలను స్వల్ప కాల పరిమితి సేవల కమిషన్‌ కింద రక్షణ శాఖ చేపడుతుంది. ఎంపికైన యువకులు ఆర్మీ సర్వీసులో పదేళ్ల పని చేస్తారు. ఆ తరువాత 14 ఏళ్ల పాటు పొడిగించుకునే అవకాశం వారికి ఉంటుంది. అయితే తాజా అగ్నిపథ్‌ స్కీమ్‌లో అంతకంటే తక్కువ సేవలను అందించేలా నియామకాలను చేపట్టనున్నారు. ఈ సర్వీసు కాలపరిమితిని కేవలం నాలుగేళ్లకే విధించారు. నాలుగేళ్ల తరువాత వారి ప్రతిభ ఆధారంగా 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పని చేసేందుకు అవకాశం కల్పించనున్నది. ప్రస్తుత స్కీమ్‌ కింద మొత్తం 45వేల మందిని త్రివిద దళాల కోసం నియామకం చేపట్టనున్నారు.

అగ్నిపథ్‌లో చేరేందుకు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువత అర్హులు. ఎంపికైన వారికి ఆరునెలల పాటు శిక్షణ ఉంటుంది. మూడున్నరేళ్లు సర్వీసులో ఉంటారు. వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్‌కు ఎంపికవుతారు. అగ్నివీరులకు కూడా సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవాలు ఉంటాయి. సర్వీసు కాలంలో 30 నుంచి 40 వేల వరకు వేతనం, ఇతర సదుపాయాలు అందిస్తారు. సర్వీసులో ప్రతిభ చూపిన వారికి సేవా పతకాలను కూడా అందజేయనున్నారు. సర్వీసు సమయంలో వేతనం నుంచి 30 శాతాన్ని రక్షణ శాఖ తీసుకుంటుంది. ఆ తరువాత మరో 30 శాతాన్ని కలిపి సర్వీసు అనంతరం మొత్తంగా 11 లక్షల 71వేలను పన్ను మినహాయింపుతో ఇవ్వనున్నది.

సైనిక శక్తిని పెంచుకునేందుకు ఆర్మీ ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగా స్వల్పకాల వ్యవధి నియామకాలకు ప్లాన్‌ వేసింది. ఈ సర్వీసుల నుంచి బయటకు వచ్చిన వారికి పారామిలటరీ బలగాల్లో చేర్చితే శిక్షణకు ఇచ్చే ఖర్చు తగ్గుతుందని రక్షణ శాఖ భావిస్తోంది. అంతేకాదు త్రివిధ దళాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. రక్షణ రంగానికి కేటాయించే వార్షిక బడ్జెట్‌లో దాదాపు సగానికి పైగా పింఛను, వేతనాలకే అయిపోతోంది. అగ్నిపథ్‌ స్కీమ్‌లో నాలుగేళ్ల కాలపరిమితితోనే నియామకాలు చేపడుతుండడంతో వారికి ఎలాంటి పింఛను సదుపాయం ఉండదు. ఇలా మిగిలిన నిధులతో త్రివిధ దళాలను అప్‌గ్రేడ్‌ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News