Jammu Airport Explosion: భారత్‌లో తొలి డ్రోన్ దాడి
Jammu Airport Explosion: జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జంట పేలుళ్లు * తెల్లవారుజామున 2గంటలకు బాంబులు జారవిడిచిన డ్రోన్లు
జమ్మూ బాంబు దాడి జరిగిన స్థలం (ఫైల్ ఇమేజ్)
Jammu Airport Explosion: భారత్ ఏ విషయంలో ఆందోళన చెందుతుందో ఇప్పుడదే జరిగింది. ఉగ్రవాదులు కంచెలు దాటకుండానే.. విరుచుకపడ్డారు. ఉగ్రమూకలు డ్రోన్ల సాయంతో దాడులకు తెగబడ్డారు. ఈరోజు తెల్లవారుజామున 2గంటలకు జమ్ములోని వాయుసేన ఎయిర్ పోర్టులోని హ్యాంగర్లపై ఉగ్రవాదులు బాంబులు వేశారు. ఉగ్రమూకలు డ్రోన్ల సాయంతోనే బాంబులు వేసినట్లు భారత వైమానిక దళ అధికారులు ధృవీకరించారు.
అదృష్టవశాత్తు వాయుసేన ఆయుధాలకు, వాహనాలకు ఎటువంటి నష్టం జరగలేదు. ఇద్దరు సిబ్బంది మాత్రం స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. భారత్‌లో జరిగిన తొలి డ్రోన్ దాడి ఇదే అని అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2గంటల సమయంలో వాయుసేన స్థావరానికి రెండు డ్రోన్లు ఎగురుకుంటూ వచ్చాయి. విమానాలు, హెలికాప్టర్లు భద్రపర్చే హ్యాంగర్లపైకి రాగానే పేలుడు పదార్థాలను జారవిడిచాయి.
ఆతర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో చోట పేలుడు పదార్థాలను పడేశాయి. ఈ పేలుళ్లలో ఒక భవనం పైకప్పునకు భారీ రంధ్రం పడింది. ఈ డ్రోన్లను రాడారు గుర్తించలేకపోవడంతో డ్రోన్లను అధికారులు నిలువరించలేకపోయారు. విమానాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దుకు ఈ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
2019 ఆగస్టు 13న అమృత్‌సర్ సమీపంలోని మోహవా గ్రామం వద్ద కూలిపోయిన పాక్ డ్రోన్ శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్ 9-16 మధ్య 8సార్లు డ్రోన్లు వచ్చి ఆయుధాలు, నగదు, మందుగుండు సామగ్రిని జారవిడిచి వెళ్లాయి. సెప్టెంబర్ 22న ఓ ఉగ్రవాదిని అరెస్టు చేస్తే ఈ విషయం బయటపడింది. గత ఏడాది జూన్ 20న జమ్ములోని హీరానగర్ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ ఒక నిఘా డ్రోన్‌ను కూల్చివేసింది.