సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్... ఆ వేలిముద్రలు నిందితుడివి కావు

Update: 2025-01-26 08:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కొత్త ట్విస్ట్... ఆ వేలిముద్రలు నిందితుడివి కావు

Saif Ali Khan case latest news updates: సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైఫ్ ఇంట్లో దాడి ఘటన అనంతరం సేకరించిన 19 రకాల వేలిముద్రలు నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదు. సైఫ్ ఇంట్లో దాడి తరువాత ముంబై క్రైమ్ బ్యూరో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధారాల కోసం క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది.

ఆ వేలిముద్రలను ముంబైలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌లోని ఫింగర్ ప్రింట్ విభాగానికి పంపించారు. ఆ తరువాత ఈ కేసులో బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి నిందితుడిగా చూపించారు. షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు సేకరించి సీఐడీలోని ఫింగర్ ప్రింట్స్ విభాగానికి పంపించారు.

సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సేకరించిన వేలిముద్రలతో షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు మ్యాచ్ అవడం లేదని రిపోర్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ నెగటివ్ రావడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరోసారి షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు దర్యాప్తు కోసం పంపించినట్లు సమాచారం అందుతోంది.

సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగి 11 రోజులు అవుతోంది. జనవరి 15న రాత్రి బాంద్రాలో సైఫ్ నివాసం ఉంటున్న సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన 70 గంటల తరువాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

నిందితుడు షరీఫుల్ ఇస్లాం కూడా తనే ఈ నేరానికి పాల్పడినట్లుగా అంగీకరించారు. తను వెళ్లింది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అనే విషయం కూడా తనకు తెలియదని షరీఫుల్ ఇస్లాం తన వాంగ్మూలంలో రాసిచ్చినట్లుగా ముంబై పోలీసులు తెలిపారు. ఇంతలోనే ఇప్పుడిలా వేలిముద్రలు మ్యాచ్ అవడం లేదని రిపోర్ట్ రావడం మరో కొత్త ట్విస్టుగా కనిపిస్తోంది. 

Tags:    

Similar News