Chandrayaan-3: మామా..మేము..వస్తున్నాం

Chandrayaan-3: చంద్రయాత్రపై పెరుగుతున్న ఉత్కంఠ

Update: 2023-08-23 07:16 GMT

Chandrayaan-3: మామా..మేము..వస్తున్నాం

Chandrayaan-3: చంద్రయాత్రపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. చంద్రుడిపై ‘విక్రమ్‌’ను విజేతగా నిలపాలని భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు పట్టుదలగా ఉన్నారు. రష్యా విఫలమైన చోట మనం నెగ్గి తీరాలన్న ఆకాంక్ష బలంగా వ్యక్తమవుతోంది. చంద్రయాన్‌ ప్రాజెక్టు విజయం సాధిస్తే దేశ వైజ్ఞానిక రంగంలో గణనీయ మార్పులు, పురోగతి సాధించే అవకాశం ఉంది. విద్యార్థులు మొదలు నిపుణులు, శాస్త్రవేత్తలు వంటివారంతా ఈ రంగంవైపు మొగ్గు చూపుతారు. భారత్‌ ప్రగతి పథంలో దూసుకెళ్లేందుకు శాస్త్ర పరిశోధన, అంతరిక్ష రంగం తోడ్పడే అవకాశాలు పెరుగుతాయి. భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3 ఎటువంటి అవాంతరాలు లేకపోతే నేడు చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగవచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అధ్యక్షుడు సోమనాథ్‌ వెల్లడించారు.

ఆ తేదీ నుంచి 14 రోజుల పాటు చంద్రుడిపై సూర్యకాంతి ప్రసరిస్తూ ఉంటుంది . కాబట్టి మన ల్యాండర్‌ ద్వారా దింపిన రోవర్‌ అన్ని రోజులూ పరిశోధన కార్యక్రమాలు నిర్వహించడం వీలవుతుంది. ఒకవేళ ఏ కారణం వల్లనైనా చంద్రయాన్‌-3 ల్యాండర్‌ చంద్రుడిపై దిగలేకపోతే 27వ తేదీన దిగే ప్రయత్నం చేస్తామన్నారు. ఆ పని దిగ్విజయంగా పూర్తయితే చంద్రుడిపై ల్యాండర్‌-రోవర్‌ను దింపిన ఘనత అమెరికా, రష్యా, చైనాల తరవాత భారతదేశానికే దక్కుతుంది. రష్యా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగడానికి లూనా-25 ని ప్రయోగించినా, అది విఫలమైంది. ఇంతవరకు ఏ దేశమూ దక్షిణ ధ్రువం వద్ద అంతరిక్ష నౌకను దింపలేదు. అందుకే ఇప్పుడు యావత్‌ ప్రపంచ దృష్టి చంద్రయాన్‌-3పై కేంద్రీకృతమైంది.

Tags:    

Similar News