శివసేన నేత సంజయ్‌ రౌత్‌కు ఈడీ నోటీసులు

Sanjay Raut: నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Update: 2022-06-28 02:26 GMT

శివసేన నేత సంజయ్‌ రౌత్‌కు ఈడీ నోటీసులు

Sanjay Raut: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్దవ్ థాకరే ముఖ్య అనుచరుడు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరుకావాలని సూచించింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో ఈడీ.. శివసేన పార్టీలో సీఎం ఉద్దవ్ తర్వాత నెంబర్‌2గా కొనసాగుతున్న సంజయ్ రౌత్‌ని విచారణకు పిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వేల కోట్ల విలువైన పత్రాచాల్ భూకుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 1,034 కోట్ల విలువైన పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఏప్రిల్ నెలలో ఈడీ జప్తు చేసింది. ఇదే కేసుతో పాటు మరో భూకుంభకోణం ఆరోపణల్లో ఈడీ కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బావమరిది శ్రీధర్‌ మాధవ్‌ ఆస్తులనూ జప్తు చేసింది. ఈ వ్యవహారంలో శివసేన, ఎన్సీపీకి చెందిన పలువురిని ఈడీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది.

ఆలీబాగ్‌లో సమావేశానికి తాను హాజరుకావాల్సి ఉందని.. దీంతో ఈడీ విచారణకు ఇవాళ మాత్రం హాజ‌రు కాలేన‌ని శివ‌సేన సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్ చెప్పారు. మ‌నీ లాండ‌రింగ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమ‌వారం ఆదేశాలు జారీ చేసింది. త‌న‌కు ఈడీ స‌మ‌న్లు రాగానే సంజ‌య్ రౌత్ స్పందించారు. త‌న‌కు ఈడీ స‌మ‌న్లు జారీ కావ‌డం వెనుక కుట్ర ఉంద‌ని ఆరోపించారు.

పెద్ద పోరాటం నుంచి తనను నిలువరించేందుకే ఈడీ సమన్లు జారీ అయ్యాయని సంజయ్ రౌత్ అన్నారు. ఒక వేళ తన తల నరికినా గువాహటి రూట్ లో వెళ్లనని సంజయ్ రౌత్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. బాలా సాహెబ్ ఠాక్రే శివసైనిక్ ల మధ్య భారీ యుద్ధం సాగుతుందని చెప్పారు.

Tags:    

Similar News