Defence Budget: పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ బడ్జెట్ రూ. 50వేల కోట్లు పెంపు..!!
Defence Budget: పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ బడ్జెట్ రూ. 50వేల కోట్లు పెంపు..!!
Defence Budget: భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రక్షణ రంగానికి రూ. 50,000 కోట్ల మేర బడ్జెట్ లో అదనపు కేటాయింపులు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా సన్నాహాలు చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది రక్షణశాఖ కేటాయింపులు రూ. 6.81 లక్షలు కోట్లు. తాజాగా పెంపునకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. దాంతో డిఫెన్స్ కు కేటాయించిన నిధులు రూ. 7లక్షల కోట్లు దాటుతాయని ఆ వర్గాలు అంటున్నాయి.
చైనా, పాకిస్తాన్ నుంచి భద్రతా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్రం బడ్జెట్లో కేటాయింపులను ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ పద్దు కింద రూ. 6, 81,210 కోట్లు ప్రతిపాదించింది. 2024-25 బడ్జెట్ కేటాయింపులతో పోల్చి చూస్తే ఇది 9.53శాతం అధికం. సవరించిన అంచనాలతో పోలిస్తే 6.2శాతం ఎక్కువగా ఉంది. అయితే తాజాగా కేటాయింపుల్లో కొత్త ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది.
రూ. 50వేల కోట్ల బడ్జెట్లో నిధులను పరిశోధన, ఆయుధాలు, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించనున్నట్లు సమాచారం. 2014-15 ఆర్థిక ఏడాదికి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో డిఫెన్స్ కేటాయింపులు రూ. 2.29 లక్షల కోట్లు. మొత్తం వార్షిక పద్దులో 13శాతం రక్షణశాఖకే కేటాయించారు.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ కు దగ్గరలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆర్మీ దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిగా పీఓకే, పాకిస్తాన్ లోని ఉగ్రస్ధావరాలను ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ వాటిని ధ్వంసంచేసింది. అది జీర్ణించుకోని పాకిస్తాన్ ఆ తర్వాత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే భారత్ ధాటిని తట్టుకోలేక పాకిస్తాన్ వెనక్కి తగ్గడంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.