Odisha: ఒడిశా రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. జనరల్ బోగీలో మరణించిన వారి వివరాలు గల్లంతు
Odisha: ప్రస్తుతం మృతుల సంఖ్య 500 దాటినట్లు సమాచారం రిజర్వేషన్ టికెట్లు ఉన్న ప్రయాణీకులే లెక్కలోకి..
Odisha: ఒడిశా రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. జనరల్ బోగీలో మరణించిన వారి వివరాలు గల్లంతు
Odisha: ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. బాలాసోర్‌లో మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో అంచనాలకు మించి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సుమారు 300 మంది మరణించినట్టు రైల్వే అధికారులు ప్రకటించినప్పుడు దేశమంతా దిగ్ర్భాంతికి గురయింది. అయితే, మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నదని, 500 పైబడి ఆ రోజు ప్రమాదంలో చనిపోయినట్టు రైల్వే బోర్డుకు అధికారులు తాజాగా నివేదిక ఇచ్చినట్టు సమాచారం.
ఇప్పటివరకు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే మరణాలను లెక్కించారు. తాజా నివేదిక కూడా దాని ఆధారంగానే రూపొందించినట్టు తెలిసింది. అయితే, జనరల్ బోగీల్లో కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్న వారి వివరాలు రైల్వే అధికారుల దగ్గర లేవు. జనరల్ టికెట్లకు సంబంధించిన ప్రయాణికుల వివరాలు రైల్వే దగ్గర ఉండటానికి అవకాశం లేదు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో ముందుభాగాన జనరల్ బోగీ ఉంది. ఇది తునాతునకలైంది. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా విగతజీవులయ్యారు. జనరల్ బోగీలో మరణించినవారి సంఖ్య తేలితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మార్చురీలో 80 మందికి చెందిన శరీర భాగాలను ఇప్పటికీ గుర్తంచలేక పోతున్నారు.