Cyclone Fengal: తమిళనాడులో ఫెంగల్ తుఫాన్.. ఏటీఎంకు వెళ్లి విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

Cyclone Fengal: చెన్నైకు చెందిన ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లి.. విద్యుత్ షాక్ తో మృతిచెందాడు.

Update: 2024-11-30 14:26 GMT

Cyclone Fengal: తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం కాగా.. జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. ఈ క్రమంలో చెన్నైలోని ఏటీఎంకు వెళ్లిన వ్యక్తి విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం నీటిలో తేలియాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చెన్నైకు చెందిన ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లి.. విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. వర్షపు నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహం ఏటీఎం బయటకు కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నై, తిరుపతి నగరాల్లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏడు విమానాలు రద్దయ్యాయి. ఇక చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలు రద్దు కాగా.. ముంబాయి, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. చెన్నై నుంచి విశాఖ, విశాఖ నుంచి చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. మరోవైపు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.



Tags:    

Similar News