CWC Meeting: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

*ఉదయం 10గం.లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ *భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ సీఎంలకు ఆహ్వానం

Update: 2021-10-16 03:39 GMT

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం(ఫైల్ ఫోటో)

CWC Meeting: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. పార్టీ గురించిన నిర్ణయాలు తీసుకునే ఉన్నతస్థాయి కమిటీ ఇదే. ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్‌లో ఉదయం 10 గంటలకు CWC సమావేశం కానుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, వ్యవస్థాగత ఎన్నికలు, అలాగే లఖింపూర్ ఖేరి ఘటన తదితర అంశాలే ప్రధాన ఏజెండాగా ఇవాల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్‌ పార్టీ అగ్రశ్రేణి నేతలంతా పాల్గొనే ఈ సమావేశంలో అనేక రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనుంది CWC.

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి కోసం కొన్నేళ్లుగా చర్చ జరుగుతుంది. పార్టీ నేతలే ఈ విషయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొందరు రాహుల్‌నే నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని భావిస్తుండగా మరికొందరు మాత్రం పార్టీలో సమూల మార్పులు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిని కచ్చితమైన విధానంలో ఎన్నుకోవాలని పట్టుబడుతున్నారు. మరోవైపు పూర్తి స్థాయి అధ్యక్షుడు లేనప్పుడు పార్టీలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏం జరుగుతుందో తెలియటం లేదంటూ కపిల్ సిబల్‌ G-23 నాయకుల ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణ వైఫల్యం తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ నిలదొక్కుకోలేదు. ఇక 2019 జూలై 3న లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. అప్పటి నుంచి పార్టీ సారథ్యంపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే CWC సమావేశంలోనైనా పార్టీ అధ్యక్షుడి నిర్ణయంపై ఓ కొలిక్కి వస్తారో రారో తెలాల్సి ఉంది.

Tags:    

Similar News