COWIN Data: దేశంలో మేజర్ డేటా లీక్.. టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం
COWIN Data: లీకైన డేటాలో ప్రముఖుల వివరాలు
COWIN Data: దేశంలో మేజర్ డేటా లీక్.. టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం
COWIN Data: దేశంలో డేటా లీక్ కలకలం రేపుతోంది. వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్ సహా పాన్ వివరాలు టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కొవిన్ పోర్టల్ నుంచే సమాచారం బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఎవరైనా ఈ డేటాను యాక్సెస్ చేసే విధంగా అందుబాటులోకి రావడం కలకలం రేపుతోంది. టెలిగ్రామ్‌లోని ఓ బాట్‌లో వ్యక్తుల ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే వారి సమస్త సమాచారం వెలుగుచూసింది. విదేశాలకు వెళ్లేందుకు కొందరు కొవిన్ పోర్టల్‌లో పాస్‌పోర్ట్ వివరాలు కూడా అందించారు.
అలాంటి వారి డేటా సైతం డేటా లీకేజీలో బయటకొచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తుల డేటా ఇలా బయటకు వచ్చిందన్న సమాచారం అనంతరం చాట్‌బాట్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. సాధారణంగా కొవిన్ పోర్టల్‌లో లాగిన్ అయినప్పుడు..మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఈ సమాచారం కనిపిస్తుంది. అలాంటిది.. ఎలాంటి ఓటీపీలతో సంబంధం లేకుండా ఈ డేటా బయటకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
లీకైన డేటాలో పలువురు ప్రభుత్వ అధికారులతో పాటు, రాజకీయ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలూ ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ వంటి నేతల వివరాలు బయటకొచ్చాయి. ఈ డేటా లీకేజీపై తృణమూల్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే స్పందించారు. సంబంధిత స్క్రీన్‌షాట్లను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇది తీవ్రమైన అంశమంటూ మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.