Coronavirus: కరోనా కొత్త వేరియంట్‌తో మళ్లీ పాత రోజులు చూస్తామా..!
Coronavirus: ప్రపంచం మళ్లీ కరోనా కొత్త వేరియంట్‌తో వణికిపోతోంది. చైనాలో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అమెరికా కూడా అదే టెన్షన్ పడుతోంది.
Coronavirus: కరోనా కొత్త వేరియంట్‌తో మళ్లీ పాత రోజులు చూస్తామా..!
Coronavirus: ప్రపంచం మళ్లీ కరోనా కొత్త వేరియంట్‌తో వణికిపోతోంది. చైనాలో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అమెరికా కూడా అదే టెన్షన్ పడుతోంది. ఇంతకీ ఈ కరోనా కొత్త వేరియంట్ గురించి మీరు విన్నారా? ఇది ఎంత వేగంగా వ్యాపిస్తుందో తెలుసా? మళ్లీ మనం పాత రోజులు చూస్తామా? అసలేంటీ NB181? ఎందుకు మళ్లీ చైనా నుంచే ఈ ముప్పు?
NB181 అనే ఈ కొత్త కరోనా వేరియంట్ ఇప్పటికే చైనాలో తీవ్రంగా విజృంభిస్తోంది. అటు హాంగ్‌కాంగ్‌లోనూ నెలరోజుల వ్యవధిలో 80కి పైగా తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఇది అక్కడి ఆరోగ్య వ్యవస్థను మళ్లీ ఒత్తిడిలోకి నెట్టేసింది. ఇటు ట్రావెలింగ్ హిస్టరీ ఉన్నవారిని అమెరికా వైద్యపరీక్షలు చేయగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రయాణికుల ద్వారా ఈ వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశించినట్లు సీడీసీ అధికారికంగా ప్రకటించింది.
ముఖ్యంగా కాలిఫోర్నియా, వాషింగ్టన్, న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లోని విమాన ప్రయాణికులలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అంతేకాదు.. ఓహియో, రోడ్ ఐలాండ్, హవాయి లాంటి రాష్ట్రాల్లోనూ ఈ వేరియంట్ కేసులు రికార్డవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వేరియంట్ ఇప్పుడు డామినెంట్‌గా మారిపోయింది.
ఇది మరణానికి కారణం కాకున్నా.. చాలా వేగంగా వ్యాపించగల శక్తి ఉందనే విషయాన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాక్సిన్ నిరోధకతను కూడా ఇది తట్టుకోగలదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ ఇప్పుడు జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, థాయిలాండ్, వియత్నాం, స్పెయిన్, నెదర్లాండ్స్ లాంటి దేశాల ద్వారా ప్రయాణిస్తున్నవారిలో కనిపించడం చూస్తే.. దీని వ్యాప్తి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా జరుగుతుండగానే.. అమెరికాలో ఆరోగ్య శాఖ ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
ఆరోగ్య పిల్లలకు, గర్భిణీలకు ఇకపై కరోనా వాక్సిన్ అవసరం లేదని అధికారికంగా ప్రకటించింది. దీనిపై వైద్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది డేటా ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని, కేవలం రాజకీయం మాత్రమేనని విమర్శిస్తున్నారు. 2020 నుంచి ఇప్పటివరకు అమెరికాలో 12 లక్షల మంది కరోనాతో మరణించగా, 1300కి పైగా చిన్నపిల్లల మరణాలకు కరోనా కారణమవడాన్ని మరిచిపోకూడదని డాక్టర్లు గుర్తు చేస్తున్నారు. అయినా కూడా ట్రంప్ సర్కార్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడంపై డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NB181 అనే ఈ కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఫ్యామిలీకే చెందిందే అయినా.. దీని లక్షణాలు గత వేరియంట్‌లకు పూర్తిగా భిన్నంగా ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఇది సాధారణ లక్షణాలతో మొదలవుతుంది. మొదట్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి కానీ.. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఇది తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తోంది. ఫుల్ స్పీడ్‌తో శరీరంలో పాకే లక్షణం దీని ప్రత్యేకత. ఇందులోని జన్యు మార్పుల కారణంగా ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాక్సిన్‌లను పూర్తిగా ఎదుర్కొగలదనే అనుమానాలు శాస్త్రవేత్తల్లో కలకలం రేపుతున్నాయి.
ఇందులోని స్పైక్ ప్రోటీన్‌లో జరిగిన మార్పులు కారణంగా ..ఇది మానవ కణాల్లోకి ప్రవేశించడానికి మరింత సహాయపడుతున్నట్టు అంటున్నారు. ప్రస్తుతం దీని వ్యాప్తి రేటు అత్యధికంగా నమోదు అవుతుండడంతో దీన్ని ఓ 'గ్రోత్ అడ్వాంటేజ్' కలిగిన వేరియంట్‌గా గుర్తించారు. ఈ వేరియంట్ వ్యాప్తిని కంట్రోల్ చేయకపోతే.. ప్రపంచానికి ప్రమాదం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాస్తవానికి ఇది మరణాల పరంగా అత్యంత ప్రమాదకరం కాకపోయినా, దీని వ్యాప్తి శక్తి వల్ల హాస్పిటల్స్ మళ్లీ ఒత్తిడిలో పడే అవకాశముంది. ముఖ్యంగా చైనాలో ఇప్పటికే అత్యవసర గదులు నిండిపోతుండడం ఆందోళనను పెంచుతోంది. ఇదే సమయంలో అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా అప్రమత్తంగా ఉండకపోతే.. పాత బాధలు మళ్లీ కొత్త రూపంలో ప్రత్యక్షమవడం ఖాయం!