రాష్ట్రపతి భవన్‌లో కరోనా కలకలం..దేశంలో 19వేలకు చేరువలో కేసులు
భారత్‌లో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చింది. రాష్రపతి భవన్‌లో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.
భారత్‌లో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చింది. రాష్రపతి భవన్‌లో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబ సభ్యుడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అతనికి కూడా వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా.. అంతకుముందే అతని కుటుంబంలో ఒకరు వైరస్ కారణంగా చనిపోయారు. అధికారులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల్లోని 125 కుటుంబాలను స్వీయ నిర్బంధంలోకి పంపించారు. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఆయా పరిసర ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19వేలకు దగ్గర్లో ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18,601మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి 590 మంది చనిపోయారు. కరోనా నుంచి 3251మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 14,759 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య 4665 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క ముంబై నగరంలోనే మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో1520 కేసులు రికార్డ్ అయ్యాయి. దేశంలో కొత్తగా1336 కేసులు రికార్డ్ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 705 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా పాజిటివ్ కేసుల విషయంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు మధ్యప్రదేశ్ ఉన్నాయి. ఢిల్లీలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వణికిస్తోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 872గా ఉంది సోమవారం 14 కొత్త కేసులు వచ్చాయి. ఇద్దరు చనిపోయారు. ఇందులో 186 మంది డిశ్చార్జి అయ్యారు. 23 మంది మరణించారు. ఏపీలో సోమవారం ఒక్క రోజే 75 కరోనా కొత్త కేసులు చేరుకున్నాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 722కు చేరింది. అందులో 92 మంది డిశ్చార్జి అయ్యారు. 20 మంది మృతి చెందారు.