Corona Virus: తాగునీటిలో వైరస్ ప్రమాదకరం కాదు

Corona Virus: వెళితే...తాగేనీటిలోనూ కరోనా రెండు రోజులపాటు బతికి వుంటుందని రాకేశ్‌ మిశ్ర తెలిపారు.

Update: 2021-04-25 04:08 GMT

Dr.Rakesh Mishra:(File Image)

Corona Virus: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. అస్సలు కరోనా వైరస్ తాగునీటిలో వుంటుందా, వుంటే ఎంత వరకు బ్రతికి వుంటుంది అనే అంశాన్ని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్ర తెలిపారు. వివరాల్లోకి వెళితే...తాగేనీటిలోనూ కరోనా రెండు రోజులపాటు బతికి ఉంటుందని రాకేశ్‌ మిశ్ర తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్‌ బతికి ఉంటుందని అన్నారు. కొవిడ్‌ వైరస్‌పై అవగాహన కల్పించేందుకు జూమ్‌లో శనివారం ఆయన సీసీఎంబీలో కొవిడ్‌ వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న దివ్యతేజ్‌, కార్తీక్‌లతో కలిసి మాట్లాడారు.

వారి మాటల్లో 4 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు చల్లని నీటిలో వైరస్‌కు ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉంటుంది. వేడినీళ్లలో 65 డిగ్రీల వద్ద వైరస్‌ నిమిషాల వ్యవధిలోనే చనిపోతుంది. నీటిలోని వైరస్‌ ఒక్కటే ఇన్‌ఫెక్షన్‌ కలిగించలేదు.. అది శరీరంలోకి వెళ్లాలంటే ప్రత్యేకించి కొన్ని వందల కణాలు కావాల్సి ఉంటుంది. అయితే తాగిన నీరు నేరుగా పొట్టలోకి వెళుతుంది కాబట్టి ప్రమాదమేమి లేదు. తాగునీటి ద్వారా కొవిడ్‌ వ్యాప్తి చెందిన కేసులు మనదేశంలో ఎక్కడా నమోదు కాలేదు. కాబట్టి అదేమంత ఆందోళన కలిగించే విషయం కాదు. ముందుజాగ్రత్తగా వేడి చేసిన గోరు వెచ్చని నీటిని, వేడి పదార్థాలనే తీసుకోవడం మంచిది. ప్రస్తుతానికి మనుషుల నుంచి మనుషులకు, గాలి ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాప్తి చెందుతోంది.

కరోనా వైరస్‌ ఎప్పటికి అంతమవుతుందనేది చెప్పలేం. అందరూ టీకాలు వేయించుకోవడం, జాగ్రత్తలు పాటించడం ద్వారా రెండునెలల్లో మహమ్మారి ప్రభావాన్ని తగ్గించగలుగుతాం. రాబోయే రోజుల్లో మరిన్ని ఔషధాలు అందుబాటులోకి వస్తాయి. పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలి. జనసమ్మర్ధం ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దు. గాలి, వెలుతురు లేని గదుల్లో ఎక్కువ సేపు గడపొద్దు. దోమల ద్వారా వైరస్‌ వ్యాప్తి జరగదు.

క్లినికల్‌గా చెప్పాలంటే మొదటి వేవ్‌తో పోలిస్తే కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో పెద్ద మార్పులేమీ లేవు. అవే లక్షణాలు, మరణాల రేటు కూడా అదే విధంగా ఉంది.ఈసారి వేగంగా వ్యాపిస్తుందని, పిల్లలకు ఎక్కువగా సోకుతుందనే ప్రచారం జరుగుతోంది. దీని గురించి చెప్పడానికి కచ్చితమైన అధ్యయనాలు లేవని తెలిపారు.

Tags:    

Similar News