Corona Cases in India: దేశంలో కొత్తగా 3,62,727 కరోనా కేసులు

Corona in India: డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచం మొత్తం కేసుల్లో 50 శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి.

Update: 2021-05-13 04:56 GMT

Corona in India Update 

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గినట్లే తగ్గి మళ్లీ 3.5 లక్షల మార్క్ దాటాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3.62 లక్షల కొత్త కేసులు నిర్దారణ కాగా.. మరో 4,136 మంది కోవిడ్-19కు బలయ్యారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచం మొత్తం కేసుల్లో 50 శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచం మొత్తం కోవిడ్ కేసులు.. ఒక్క భారత్‌లో నమోదవుతున్న వాటి కంటే తక్కువ కావడం గమనార్హం.

భారత్‌లో మరోసారి రోజువారీ కోవిడ్ కేసులు 3.5 లక్షలు దాటాయి. భారత్ తర్వాత బ్రెజిల్‌లో 25,200 కేసులు, అమెరికాలో 22,261 కేసులు, ఫ్రాన్స్, ఇరాన్‌లో 18 వేల చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. రోజువారీ మరణాల్లోనూ భారత్ టాప్‌లో ఉంది. గడచిన 24 గంటల్లో 4వేలకుపైగా మరణాలు చోటుచేసుకోగా.. మరే దేశంలోనూ ఈ సంఖ్య 1,000 దాటలేదు.

మహారాష్ట, కేరళలో మరోసారి కోవిడ్ కేసులు 40వేల మార్క్ దాటాయి. మహారాష్ట్రలో 46,781, కేరళలో 43,529, కర్ణాటకలో 39,998 కేసులు బయటపడ్డాయి. తమిళనాడులో తొలిసారిగా పాజిటివ్ కేసులు 30వేలకుపైగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఈ నాలుగు రాష్ట్రాల్లో మరే దేశంలో లేనివిధంగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్‌లో 20వేలకుపైగా కేసులు నమోదుకాగా.. యూపీ, రాజస్థాన్‌లో 15,000-18,000 మధ్య బయటపడ్డాయి.

13 రాష్ట్రాల్లో 10వేలకుపైగా కేసులు నమోదుకాగా... 5వేల-10వేల మధ్య ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్ధారణ అయ్యాయి. ఇక, కోవిడ్ మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. అక్కడ 892 మరణాలు చోటుచేసుకోగా.. తర్వాత కర్ణాటకలో 517 మంది బలయ్యారు. యూపీలో 326, ఢిల్లీలో 300, తమిళనాడులో 292, హరియాణాలో 165, రాజస్థాన్‌లో 164, చత్తీస్‌గఢ్‌లో 153, పశ్చిమ్ బెంగాల్‌లో 135, గుజరాత్‌లో 102 మంది మృతిచెందారు.

Tags:    

Similar News