CM Revanth Reddy
CM Revanth Reddy: నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 10.30గంటలకు ప్రధాని మోదీని కలవనున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ సమాచారం రావడంతో ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. గతేడాది జులైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి దాదాపు 6 నెలల అనంతరం మళ్లీ సమావేశం కానున్నారు. ఇటీవల ఎస్ఎల్ బీసీ ప్రమాదంపై మోదీ రేవంత్ తో ఫోన్ లో మాట్లాడారు. బుధవారం భేటీలో ఈ ఘటనను పూర్తి స్థాయిలో వివరించడంతోపాటు ప్రాజెక్టులపై కేంద్రం సాయం కోరనున్నట్లు తెలిసింది. మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు విభజన చట్టంలోని పలు పెండింగ్ సమస్యలను ప్రధానికి విన్నవించనున్నట్లు సమాచారం. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలపై పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి తన అధికార నివాసంలో రాష్ట్ర అధికారులతో చర్చించారు.