ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 31 మంది నక్సల్స్, ఇద్దరు పోలీసులు మృతి

Update: 2025-02-09 09:07 GMT

Encounter

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు జవాన్లను హెలీక్యాప్టర్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేసి బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల కాలంలో అత్యధిక సంఖ్యలో నక్సలైట్లను మట్టుబెట్టిన భారీ ఎన్‌కౌంటర్ ఇదే. ఇప్పటికి ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతూనే ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగొచ్చని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు. ఎన్ కౌంటర్ పూర్తయితే కానీ మొత్తం మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం ఉదయం నుండే ఈ ఎన్‌కౌంటర్ కోనసాగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌‌లో మావోయిస్టుల ఏరివేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చూడటమే తమ ధ్యేయమని గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌ అడవులను డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, సీఆర్పీఎఫ్‌లోని COBRA బలగాలు, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఉమ్మడి బలగాలుగా ఏర్పడి జాయింట్ కూంబింగ్ ఆపరేషన్‌లో చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం నాడు ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

40 రోజుల్లోనే 81 మంది నక్సల్స్ మృతి

ఇవాళ్టి ఎన్‌కౌంటర్ ఘటనతో కలిపి ఈ ఏడాది మొదలయ్యాక జనవరి 1వ తేదీ నుండి ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 81 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ 10 రోజుల వ్యవధిలోనే ఛత్తీస్‌గఢ్‌లో మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఫిబ్రవరి 2వ తేదీన ఇదే బీజాపూర్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ మరుసటి రోజే కంకడ్ - నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఒక మావోయిస్ట్ చనిపోయారు. 

Full View

తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో సెక్యురిటీ టైట్

ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో అక్కడి మావోయిస్టులు తల దాచుకునేందుకు షెల్టర్ కోసం వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోనూ తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫిబ్రవరి 1న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు మావోయిస్టులు కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఫిబ్రవరి ౭న జరిగిన ఇంకో ఘటనలో తాలిపేరు డ్యామ్ వద్ద వాహనాల తనిఖీలు చేసే క్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో నలుగురు మావోయిస్టులను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. 

Tags:    

Similar News