ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టులు, 1 జవాన్ మృతి

Update: 2025-03-20 08:06 GMT

Encounter

Chhattisgarh encounter news today: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాల వైపు నుండి ఒక జవాన్ ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం ఉదయం కూంబింగ్‌లో ఉన్న భద్రతా బలగాలకు రెడ్ రెబెల్స్ దళానికి చెందిన మావోయిస్టులు ఎదురైనట్లు తెలుస్తోంది. అప్పటి నుండి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయని భద్రతా బలగాలు తెలిపాయి.

బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నక్సలైట్స్ కదలికలు ఉన్నాయని పోలీసులు స్పష్టమైన సమాచారం అందింది. ఆ సమాచారంతోనే డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు ఆ ప్రాంతంలో జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ చేశాయి. ఈ క్రమంలోనే భద్రతా బలగాలకు నక్సలైట్స్ ఎదురవడంతో ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం అందుతోంది. 

అంబుజ్‌మడ్‌లో ఐఇడి పేల్చిన మావోయిస్టులు

ఇదిలావుంటే, నారాయణపూర్ జిల్లాలో ఇవాళే జరిగిన మరో ఘటనలో మావోయిస్టులు ఐఇడీ బాంబును పేల్చేశారు. అంబుజ్‌మడ్ పరిసరాల్లో జరిగిన ఈ పేలుడులో ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగలేదు. పేలుడు ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఈ పేలుడుకు పాల్పడిన నక్సలైట్స్ అక్కడి చుట్టు పక్కల ప్రాంతాల్లోనే తలదాచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. దాంతో అంబుజ్‌మన్ అటవీ ప్రాంతాన్ని భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. 

పెరిగిన ఎన్‌కౌంటర్లు

ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో తరచుగా ఎన్‌కౌంటర్స్ జరుగుతున్నాయి. 2026 ఏప్రిల్ నాటికల్లా మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఆదేశాలతో ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. భద్రతా బలగాలు అన్నివైపుల నుండి అష్టదిగ్భందనం చేసి అడవులను గాలిస్తున్నాయి. ఫలితంగా ఎన్‌కౌంటర్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నుండి  ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన నక్సలైట్స్ సంఖ్య 100 కు పైనే ఉంటుందని క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి.   


Tags:    

Similar News