Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్
Chhattisgarh encounter news today: ఛత్తీస్‌గఢ్‌లో ఆదివారం ఉదయం మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటికీ ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా వారు చెబుతున్నారు.
ఆదివారం ఉదయం మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టిన భద్రత బలగాలకు నక్సలైట్స్ తారసపడటంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, సీఆర్పీఎఫ్‌లో జంగిల్ వార్ ఫేర్ యూనిట్స్‌గా పేరున్న COBRA బలగాలు, సీఆర్పీఎఫ్‌కు బలగాలు ఈ జాయింట్ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
వరుస ఎన్‌కౌంటర్లు
ఈ 10 రోజుల వ్యవధిలో ఛత్తీస్‌గఢ్‌లో ఇది మూడో ఎన్‌కౌంటర్. ఫిబ్రవరి 2వ తేదీన ఇదే బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ మరుసటి రోజు కంకడ్ - నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఒక మావోయిస్ట్ చనిపోయారు.
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సెక్యురిటీ టైట్
ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్‌కౌంటర్లతో అక్కడి మావోయిస్టులు తల దాచుకునేందుకు షెల్టర్ కోసం వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోనూ తెలంగాణ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫిబ్రవరి 1న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు మావోయిస్టులు కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఫిబ్రవరి ౭న జరిగిన ఇంకో ఘటనలో తాలిపేరు డ్యామ్ వద్ద వాహనాల తనిఖీలు చేసే క్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మరో నలుగురు మావోయిస్టులను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఎన్‌కౌంటర్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అప్‌డేట్ అవుతోంది. పేజ్ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.