Ajay Mishra - Viral Video: సోషల్‌ మీడియాలో కేంద్రమంత్రి అజయ్‌ పాత వీడియో వైరల్‌

Ajay Mishra - Viral Video: నేను మంత్రిని కాకముందు ఏమిటో ప్రజలకు తెలుసంటూ వీడియో

Update: 2021-10-05 05:28 GMT

Ajay Mishra - Viral Video: సోషల్‌ మీడియాలో కేంద్రమంత్రి అజయ్‌ పాత వీడియో వైరల్‌

Ajay Mishra - Viral Video: ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన నలుగురు రైతు కుటుంబాలకు యూపీ ప్రభుత్వం 45 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. గాయపడిన రైతులకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్టుగా రాష్ట్ర హోంశాఖ వెల్లడించింది.

లఖింపూర్‌ ఖేరి హింసాకాండపై రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కాన్వాయ్‌ దూసుకుపోయిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా, ఆ తర్వాత జరిగిన హింసాకాండలో బీజేపీ కార్యకర్తలు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడైన ఆశిష్‌ ఒక వాహనాన్ని నడుపుతున్నాడని రైతులు ఆరోపించడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. FIR లో మంత్రి కుమారుడితో పాటు.. ఇంకా ఇతర వ్యక్తుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఆశిష్ మిశ్రాకు ఈ హింసతో సంబంధం లేదని మంత్రి అజయ్ మిశ్రా ఖండించారు. ఘటన జరిగిన సమయంలో తన కొడుకు అక్కడ లేడని, దుండగులు ఎవరో కర్రలు, కత్తులతో వారిపై దాడి చేశారన్నారు. ఆ సమయంలో అశిష్‌ అక్కడే ఉండి ఉంటే.. సజీవంగా బయటకు వచ్చేవాడు కాదని చెప్పారు.

ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో మంత్రి అజయ్‌ మిశ్రా పాత వీడియో ఒకటి హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఆయన రైతులపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి నాకు రెండు నిమిషాలు చాలు అని ఆయన అంటున్నట్టుగా వీడియోలో ఉంది. ''నాతో తలపడండి. కేవలం 2 నిమిషాల్లో మిమ్మల్ని దారికి తెస్తా. నేను మంత్రినో, ఎంపీనో, ఎమ్మెల్యేనో మాత్రమే కాదు. అంతకు ముందు నుంచి ప్రజలకు నేనెవరో తెలుసు. సవాళ్ల నుంచి నేను పారిపోను''అని ఆ వీడియోలో ఉంది. 

Tags:    

Similar News