విమాన సర్వీసులను నిలిపివేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌

Update: 2019-04-18 02:22 GMT

మరో విమానయాన సంస్థ దివాళా అంచులకు చేరింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ కొంతకాలంగా రుణభారం, నిధుల కొరతతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగులకు జీతాలు సైతం చెల్లించడం లేదు. దీంతో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది సంస్థ. కార్యకలాపాలను కొనసాగించేందుకు అత్యవసరంగా కావాల్సిన రూ. 400 కోట్లను సమకూర్చేందుకు బ్యాంకులు కూడా నిరాకరించాయి. దాంతో చేసేదేమి లేక ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 20 వేల మందికి పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కాగా విమాన సర్వీసులను నిలిపివేసిన విషయాన్నీ అధికారికంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది.

'రుణదాతల నుంచి గానీ మరే ఇతర మార్గాల ద్వారా గానీ అత్యవసరంగా కావాల్సిన నిధులు లభించే భరోసా లేదు. దీంతో కార్యకలాపాలు కొనసాగించే క్రమంలో ఇంధన విక్రేతలకు, ఇతరత్రా సేవలందించే వారికి చెల్లింపులు జరపలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాం. దేశీయంగాను, విదేశీ రూట్లలోనూ నడిపే ఫ్లయిట్స్‌ అన్నింటినీ తక్షణం రద్దు చేయాల్సి వస్తోంది. బుధవారం రాత్రి అమృత్‌సర్‌ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి రాత్రి 10.30 గం.లకు వెళ్లే ఫ్లయిట్‌ ఆఖరుది' అని తెలిపింది.  

Similar News