హోమ్ లోన్స్ తీసుకునేవారికి కేంద్రం ఊరట

Update: 2019-07-05 08:56 GMT

రుణాలు తీసుకుని ఇల్లు కట్టుకునే మధ్య తరగతి జీవులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం కల్పిస్తున్న వడ్డీ రాయితీని మరో రూ.లక్షన్నరకు పెంచింది. దీంతో హోమ్‌ లోన్స్‌పై వడ్డీ రాయితీ రూ.3.5లక్షలకు పెరిగింది. దీంతో సొంతింటి కలను నిజం చేసుకునేందుకు తాపత్రయపడే మధ్య తరగతి జీవులకు కేంద్రం భరోసా కల్పించినట్టయ్యింది.

దేశంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు సమకూరేలా అందుబాటు ఇళ్లను ప్రజలకు చేరువ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. 2019-22 మధ్య 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్ధల ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటివరకు హోమ్‌లోన్స్‌పై కేంద్రం 2లక్షలకు మాత్రమే వడ్డీ రాయితీ ఇచ్చేది. తాజా బడ్జెట్లో పేర్కొన్న ప్రకారం 45లక్షల లోపు రుణం తీసుకున్న వారికి 3.5లక్షల వరకు వడ్డీ రాయితీ కల్పించనున్నారు. దేశంలో అందరికీ ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి ఈ వెసులుబాటు కల్పిస్తోందని నిర్మలా తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగానే ప్రస్తుతం 114 రోజుల్లోనే ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు నిర్మలా సీతారామన్. 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 

Tags:    

Similar News