BMC Water Supply: ముంబైకి పొంచివున్న మరో ముప్పు

ఇప్పటికే కరోనాతో విలవిల్లాడుతున్న ముంబై నగరానికి గోరుచుట్టుమీద రోకటిపోటులా నీటిసమస్య వచ్చిపడింది.

Update: 2020-06-22 06:06 GMT

 ఇప్పటికే కరోనాతో విలవిల్లాడుతున్న ముంబై నగరానికి గోరుచుట్టుమీద రోకటిపోటులా నీటిసమస్య వచ్చిపడింది. ముంబై దాహార్తిని తీరుస్తున్న మొత్తం ఏడు చెరువులు ప్రస్తుతం అడుగంటాయి. కేవలం ఆరు వారాలు మాత్రమే నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గతేడాది జూన్ మాసంలో వానలు భారీగానే కురిసినా సరస్సుల్లోకి పెద్దగా నీరు చేరలేదు.

ముంబైకి నీరందించే వైతర్ణ, మధ్య వైతర్ణ, మోదక్ సాగర్, భట్సా, విహార్, తన్సా, తులసి సరస్సులకు దాదాపు 14.47 లక్షల లీటర్ల తాగు నీటిని స్టోర్ చేసుకునే సామర్ధ్యం ఉంది. అయితే ప్రస్తుతం ఈ సరస్సులలో 1.57 లక్షల లీటర్ల నీరు మాత్రమే ఉంది. దీంతో ముంబైకి అవసరమైన మేర తాగునీరు అందదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎవరూ ఆందోళన చెందవద్దని.. ముందుముందు వానలు బాగా కురుస్తాయనే సమాచారం తమకు ఉందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు చెప్పారు.

అంతేకాదు 2018లో ఇంతకంటే దారుణంగా పరిస్థితి ఉందని.. అలాగే గతేడాది ఇదే సమయానికి 82,829 లీటర్ల నీరు మాత్రమే ఉందని.. అందువల్ల 10 శాతం మేర వాటర్ పంపింగ్ తగ్గించమని.. అయితే ఈ ఏడాది కోత ఉండకపోవచ్చని బీఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదిలావుంటే ముంబై దాహార్తిని తీర్చడానికి రోజుకు 420 కోట్ల లీటర్లు అవసరం కాగా, 375 కోట్ల లీటర్లను మాత్రమే బీఎంసీ పంపిణీ చేస్తోంది.


Tags:    

Similar News