బీహార్ డీజీపీ రాజీనామా.. ఎన్డీఏ నుంచి పోటీ చేస్తారా?

నవంబర్ లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పొత్తులు తేలక పార్టీలు సతమతవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు..

Update: 2020-09-23 09:50 GMT

నవంబర్ లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పొత్తులు తేలక పార్టీలు సతమతవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన బీహార్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐపిఎస్ అధికారి.. ఆయన రాజీనామాను కూడా ప్రభుత్వం ఆమోదించింది. అయితే రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. రానున్న ఎన్నికల్లో పాండే అసెంబ్లీకి పోటీ చేస్తారని ఊహాగానాలు వినబడుతున్నాయి.. అందులో భాగంగానే డీజీపీ పదవికి రాజీనామా చేసి ఉంటారనే చర్చ జరుగుతోంది. పాండే స్వచ్ఛంద పదవీ విరమణ గురించి చర్చలు బీహార్‌లో చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విషయంలో పాండే ఎక్కువగా వార్తలలో నిలిచారు. సుశాంత్ కేసు విషయంలో విమర్శలు రావడంతో రాజీనామా చేసారు అని ప్రచారం జరిగింది.

దీనిపై స్పందించిన గుప్తేశ్వర్ పాండే.. ఈ మేరకు మీడియా ప్రకటన ఒకటి విడుదల చేసారు. తన పదవీ విరమణకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుతో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. అలాగే తాను ఎన్నికలలో పోటీ చేస్తానని ఎప్పుడు చెప్పలేదని అన్నారు. మరోవైపు పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. మంగళవారంతో ఆయన వర్కింగ్‌ డేస్‌ పూర్తయ్యాయి. దీంతో రాష్ట్రంలో డీజీపీ పోస్టు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది.

ఇదిలావుంటే తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదని పాండే తేల్చి చెప్పినప్పటికీ.. బక్సర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కొందరు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నుండి పాండే టికెట్ పొందే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏమి జరుగుతోందో చూడాలి అంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Tags:    

Similar News