బీహార్ లో బీజేపీకి తలనొప్పి.. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం

రెండు రోజుల కిందట అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ప్రతిపక్షాల గ్రాండ్ అలయన్స్ కంటే అధికార ఎన్డీఏకు సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది..

Update: 2020-09-28 09:08 GMT

రెండు రోజుల కిందట బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ప్రతిపక్షాల గ్రాండ్ అలయన్స్ కంటే అధికార ఎన్డీఏకు సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కోపంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చిరాగ్ పాస్వాన్ సీట్ల కేటాయింపునకు సంబంధించి కేంద్ర హోంమంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు. అవసరమైన సంఖ్యలో తమ పార్టీకి సీట్లు కేటాయించకపోతే జెడియు కు వ్యతిరేకంగా అభ్యర్ధులని నిలబెడతామని పాస్వాన్ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం బీజేపీకి తలనొప్పిగా మారింది. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా.. అటు జేడీయూకు సర్ది చెప్పుకోలేక ఇటు ఎల్జేపీకి అడిగినన్ని సీట్లు కేటాయించలేక సతమతమవుతోంది.

ఎన్డీయేలో సీట్ల కేటాయింపునకు సంబంధించి వార్తలు వచ్చాయి.. ఇందులో జేడీయూ పార్టీ అత్యధిక సీట్లను తీసుకుంది. అయితే ఎల్జేపీకి బలమున్న స్థానాల్లో జేడీయూ అభ్యర్థిని నిలపాలని నితీష్ కుమార్ భావిస్తున్నారని.. ఇలా అయితే మిత్రధర్మం పాటించినట్టు ఎలా అవుతుందని పాశ్వాన్ ప్రశ్నించారు. దీనిపై జేడీయూ పార్టీ కనీసం వివరణ ఇవ్వలేదు. దీంతో సీట్ల కేటాయింపు సమస్యను లేవనెత్తుతూ అమిత్ షాకు లేఖ రాశారు చిరాగ్ పాస్వాన్.. అందులో తమ పార్టీకి 33 సీట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లలో 2 సీట్లు తమ పార్టీకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.. ఇక గతంలో ఇచ్చిన హామీ విధంగా తనకు రాజ్యసభ సీటు ఇవ్వని పక్షంలో బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పాశ్వాన్ కోరుతున్నారు.

Tags:    

Similar News