Prayagraj Train: భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు ప్రయాగ్ రాజ్ రైలు రద్దు
Prayagraj Train: కుంభమేళాకు వెళ్లాలనుకున్న భక్తులకు కీలక సూచన చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన 12791 నెంబర్ రైలును రైల్వే బోర్డు రద్దు చేసింది. ఇది బుధవారం ఉదయం 9.25గంటలకు బయలుదేరాల్సి ఉండగా మంగళవారం రాత్రి 7.35 గంటలకు అంటే దాదాపు 14గంటల ముందు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్ కు రావాల్సిన 12792 నెంబర్ రైలును ఆపరేషనల్ కారణంతో రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దాదాపు 1500 మంది ప్రయాణికులు నెల, రెండు నెలల ముందే కుంభమేళాకు ఈ రైల్లో వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. బయలుదేరేది తెల్లవారే కావడంతో ప్రయాణానికి సిద్ధం అయ్యారు. ఇంతలో ఈ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ సెల్ ఫోన్లో సమాచారం అందించింది. దీంతో కుంభమేళాకు ఎలా వెళ్లేది అంటూ ప్రయాణికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ శాఖపై విమర్శలు సైతం గుప్పిస్తున్నారు.
ప్రయాగ్ రాజ్ కు వెళ్లేందుకు రాష్ట్రం నుంచి బయలుదేరే రైలు ఒకటే ఒకటి ఉంది. సాధారణ రోజుల్లోనే అధిక డిమాండ్ ఉంటుంది. కుంభమేళాకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉండటంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రానూపోనూ ఒక్కరికే రూ. 50వేల ఖర్చు అవుతున్న నేపథ్యంలో చాలా మంది రైలు ప్రయాణానికే ప్రాధాన్యమిస్తున్నారు.
అయితే రైలు రద్దు నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఉన్నది ఒకటే రెగ్యులర్ రైలు అని కొనసాగించాలని రైల్వే బోర్డును కోరినట్లు తెలిపింది. ప్రయాగ్ రాజ్ మార్గంలో రైల్వే ట్రాక్ లో రద్దీ కారణంగా రద్దు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు చెప్పినట్లు సమాచారం.